
ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా
న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసిన ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు డీయూ విద్యార్థులు, అధ్యాపకులు శనివారం ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ వద్ద వారు ధర్నా చేశారు. మహారాష్ట్ర పోలీసులు అక్రమంగా సాయిబాబాను అరెస్టు చేశారని ఆరోపించారు. ఢిల్లీ స్టూడెంట్ యూనియన్, జేఎన్‌యూఎస్‌యూతోపాటు క్రాంతి కారీ యువ సంఘటన్‌కి చెందిన 100 మందికిపైగా విద్యార్థి సంఘాల నాయకులు, డీయూ ప్రొఫెసర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
మహారాష్ట్ర పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్టయిన ప్రొఫెసర్ సాయిబాబా వికలాంగుడని కూడా చూడకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వారు ఆరోపించారు. పోలీసులు బేషరుతుగా ప్రొఫెసర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న డీయూ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ డి సుకుమార్ మాట్లాడుతూ సాయిబాబా 90 శాతం వికలాంగుడని, ఒకవేళ ఆయనపై అభియోగాలుంటే పోలీసులు ఆయనను ఇంటివద్దే విచారించొచ్చని చెప్పారు. దళితులు, ఆదివాసీయులకు న్యాయం చేయాలని పోరాడుతున్న వ్యక్తులను ప్రభుత్వం ఇలా అరెస్టు చేయడం అనైతికం, అప్రజాస్వామికం అన్నారు. సాయిబాబాపై అభియోగాలున్నాయని పోలీసులు చెబుతున్నారే కానీ అది నిజమా కాదా చట్టం నిర్ణయిస్తుందన్నారు. అన్ని విధాలుగా సహకరిస్తానని సాయిబాబా చెప్పినా పోలీసులు ఇలా వ్యహరించడాన్ని ఖండిస్తున్నామన్నారు.
దాదాపు రెండు గంటలపాటు విద్యార్థులు, అధ్యాపకులు శాంతియుతంగా ఆందోళన చేసిన అనంతరం సాయిబాబా అరెస్టు, మహారాష్ట్ర పోలీసుల తీరును వివరిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పథ్వీరాజ్ చౌహాన్‌కి వారు ఒక లేఖ రాశారు. దానిని మహారాష్ట్ర సదన్ రెసిడెంట్ కమిషనర్ ద్వారా మహారాష్ట్ర సీఎంకి పంపుతున్నట్లు తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని నల్లమిల్లి గ్రామానికి చెందిన సాయిబాబా హైదరాబాద్లో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ చేశారు. సీఫెల్ నుంచి డాక్టరేట్ పొందిన ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు.