బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది.
న్యూఢిల్లీ: బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఖాతాదారులు తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునేందుకు పెద్ద ఎత్తున బ్యాంకులకు తరలి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. కేవలం బ్యాంకు సెక్యూరిటీ గార్డులే కాకుండా పోలీసులను కూడా నియమించాలని పేర్కొంది.
పాత 500, 1000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు ప్రజలు.. బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు క్యూ కడుతున్నారు. అలాగే ఈ రోజు నుంచి ఏటీఎంలు పనిచేస్తుండటంతో డబ్బు తీసుకునేందుకు వాటి ముందు బారులు తీరారు. సిబ్బంది ఏటీఎంలో ఉన్న పాతనోట్లను తీసివేసి కొత్త నోట్లను నింపారు. బ్యాంకుల్లో కొత్త 2000, 500 రూపాయల నోట్లను ఇస్తున్నారు. కాగా చాలా నగరాల్లో ఈ రోజు ఏటీఎంలు పనిచేయలేదు.