సాక్షి, న్యూఢిల్లీ : నగదురహిత దేశంగా భారత్ రూపుదిద్దుకుంటోంది అనడంలో మరో ఆధారం. దేశవ్యాప్తంగా ఆ ఏడాదిలో జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో 358 ఏటీఎంల మేర తగ్గిపోయాయి. ఏటీఎంల సంఖ్య తగ్గిపోవడం ఇదే తొలిసారి. గత నాలుగేళ్లలో ఏటీఎంల సంఖ్య 16.4 శాతం పెరిగినప్పటికీ, గతేడాది నుంచి మాత్రం వృద్ధి 3.6 శాతం మందగించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం క్రమక్రమంగా నగరాల్లో ఏటీఎంల సంఖ్యను బ్యాంకులు కూడా తగ్గిచేస్తున్నాయి. దేశంలో అతిపెద్ద ఏటీఎం నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న ఎస్‌బీఐ కూడా తన ఏటీఎంల సంఖ్యను తగ్గించేసింది. ఈ ఏడాది జూన్‌లో 59,291 ఏటీఎంలు కలిగి ఉన్న ఎస్‌బీఐ, ఆ సంఖ్యను ఆగస్టు నాటికి 59,200కి కుదించింది. పంజాబ్ నేషన్ బ్యాంకు కూడా 10,502గా ఉన్న ఏటీఎంలను, 10,083కు తగ్గించింది. ఇలా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా తన ఏటీఎంల సంఖ్యను తగ్గించేసింది. మెట్రోల్లో, ఎయిర్‌పోర్టుల్లో, ప్రైమ్ లోకేషన్లలో ధరలు అద్దె ధరలు పెరిగిపోతుండటం కూడా దీనికి మరో కారణం. మరోవైపు సెక్యురిటీ స్టాఫ్‌కు, ఏటీఎం ఆపరేటర్లకు చెల్లించే వేతనాలు, ఎలక్ట్రిసిటీ బిల్స్, మెయింటనెన్స్ ఛార్జీలు ఇలా ప్రతి ఒక్కటి బ్యాంకులకు భారంగా నిలుస్తోంది.
నగదు రహిత దేశంగా భారత్‌ను మరల్చాలని మరోవైపు నుంచి ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా తమ వ్యయాలను తగ్గించుకుంటూ.. ఏటీఎంల సంఖ్యను తగ్గించేస్తున్నాయి. ఎస్‌బీఐ ఇటీవల అనుబంధ బ్యాంకులను తనలో విలీనం చేసుకున్న క్రమంలో, అనుబంధ బ్యాంకు ఏటీఎం ఉన్న దగ్గర తన ఏటీఎంను మూసివేయడం వంటి చర్యను చేపట్టింది. దీంతో కస్టమర్లకు అంత పెద్ద ప్రభావం చూపదని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు.. హెచ్‌డీఎఫ్‌సీ రేషనలైజేషన్ క్రమంలో, తన కొన్ని మిషన్లను, రద్దీ ప్రాంతాలకు తరలించింది. ప్రజలు కూడా అంతకముందు తమ డెబిట్ కార్డులను ఏటీఎం విత్ డ్రాలకు వాడేవారు. కానీ ప్రస్తుతం ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయాల్సినవసరం లేకుండా దుకాణాల్లోనే టెల్లర్ మిషన్లు వచ్చేశాయి. తమకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని అక్కడే డెబిట్ కార్డుల ద్వారా బిల్లు చెల్లింపులు చేసేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment