
మెకానిక్ కొడుకు అరుదైన ఘనత
ఓ మెకానిక్ కొడుకు అరుదైన ఘనత సాధించాడు. తన ప్రతిభా సామర్థ్యాలతో కోటి రూపాయల స్కాలర్ షిప్ కైవసం చేసుకున్నాడు.
కాన్పూర్: ఓ మెకానిక్ కొడుకు అరుదైన ఘనత సాధించాడు. తన ప్రతిభా సామర్థ్యాలతో కోటి రూపాయల స్కాలర్ షిప్ కైవసం చేసుకున్నాడు. ఈ ఉపకార వేతనంతో వరల్డ్ టాప్ యూనివర్సిటీల్లో ఒకటైన మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో అతడు ఇంజనీరింగ్ విద్య అభ్యసించనున్నాడు.
కాన్పూర్ లోని కళ్యాణ్ పూర్ ప్రాంతానికి చెందిన ఆయుష్ శర్మ(17) ఈ ఘనత సాధించాడు. అతడి తండ్రి రాకేశ్ శర్మ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్(పీడబ్ల్యూడీ) మెకానిక్ పనిచేస్తున్నాడు. తల్లి మంజులత శర్మ రిటైర్డ్ సీర్పీఎఫ్ కానిస్టేబుల్. ఐఐటీ క్యాంపస్ లోని కేంద్రీయ విద్యాలయలో చదువుతున్న ఆయుష్ శర్మ ఈ ఏడాది 12వ తరగతి పరీక్షలు రాశాడు.
ఎంఐటీ స్కాలర్ షిప్ కోసం అతడు టోఫెల్ లో అర్హత సాధించాడని అతడి తల్లి మంజులత తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో తమ పాఠశాలలో అతడు టాప్ లో నిలిచాడని వెల్లడించారు. యేల్ యూనివర్సిటీలో 15 రోజుల కార్యక్రమానికి అతడు హాజరయ్యాడని తెలిపారు. ఎంఐటీలో చేరేందుకు సెప్టెంబర్ లో ఆయుష్ శర్మ అమెరికా వెళ్లనున్నాడు.