క్యూలైన్లు అక్కడ తగ్గి.. ఇక్కడ పెరిగాయ్!
క్యూలైన్లు అక్కడ తగ్గి.. ఇక్కడ పెరిగాయ్!
Published Sat, Nov 19 2016 12:20 PM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM
న్యూఢిల్లీ : పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయానికి నేటికి పదిరోజులు. ఇన్ని రోజులకి శనివారం బ్యాంకుల వద్ద క్యూలైన్లు కొంచెం తగ్గుముఖం పట్టాయి. కానీ ఏటీఎంల వద్ద పరిస్థితి మాత్రం అలాగే ఉంది. క్యూలైన్లతో ఏటీఎంలు కిటలాడుతున్నాయి. అమలులో లేని నోట్ల మార్పిడిలో కఠినతరమైన నిబంధనలు, కేవలం వారి సొంత కస్టమర్లకే నేడు బ్యాంకులు పనిచేయనుడటంతో బ్యాంకులు వద్ద క్యూలైన్లు తగ్గినట్టు తెలుస్తోంది.
అదేవిధంగా నేడు రూ.500, రూ.1000 నోట్ల మార్పిడినీ బ్యాంకులు చేపడటం లేదు. కేవలం సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఎలాంటి నిబంధనలు లేకుండా.. ఏ బ్యాంకు బ్రాంచులోనైనా నోట్ల మార్పిడిని చేసుకునే అవకాశాన్ని నేడు బ్యాంకులు కల్పిస్తున్నాయి. నగదు డిమాండ్ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రభుత్వం నోట్ల మార్పిడినీ రూ.4500 నుంచి రూ.2000కు ప్రభుత్వం కుదించిన సంగతి తెలిసిందే.
క్రమక్రమంగా బ్యాంకు శాఖల్లో క్యూలైన్లు తగ్గుతాయని, ఆందోళనకర పరిస్థితులు వైదొలుగుతాయని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. వచ్చిన కస్టమర్లే పలుమార్లు రాకుండా.. ఇతరులకు కూడా అవకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం ఇంక్ నిబంధనను తీసుకొచ్చింది. నోట్ల మార్పిడికి వచ్చిన కస్టమర్ల వేళ్లకు ఇంక్ గుర్తువేస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల వద్ద క్యూలైన్లు తగ్గుతున్నట్టు తెలుస్తోంది. కానీ ఏటీఎం వద్ద మాత్రం పరిస్థితి మారలేదు. బ్యాంకుల వద్ద పరిమితులు విధించే సరికి, ఏటీఎం వద్ద క్యూలైన్లు భారీగా పెరిగాయి. నోట్ల రద్దు అనంతరం నగదును ప్రజలకు సులభతరంగా అందుబాటులోకి తేవడంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, ప్రభుత్వం పడరానిపాట్లు పడుతోంది.
నగదు లావాదేవీలు అధికంగా జరిపే కూరగాయల వర్తకులు, దాబాలు, చిన్నదుకాణదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో వారికి సరిపడ నగదును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాలేకపోతోంది. చిన్న కరెన్సీ నోట్లు కూడా లేకపోవడంతో ప్రజలు వారి కనీసఅవసరాలు తీర్చుకోవడం కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రుల్లో చికిత్సపొందే పేషంట్ల పరిస్థితైతే ఇక చెప్పనక్కర్లేదు. మెడిషిన్లు కొనుక్కోవడానికి కూడా వారి దగ్గర డబ్బులు ఉండటం లేదు.
Advertisement
Advertisement