ప్రాక్టీస్‌లో భారత టాప్ బౌలర్‌కు గాయం!
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో కీలకమైన ఫైనల్ సమరానికి సన్నద్ధమవుతున్న తరుణంలో భారత్ టాప్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు గాయమైంది. ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా ఫీల్డింగ్ చేస్తుండగా అతని మోకాలుకు గాయమైంది. దీంతో అతను 30 నిమిషాలపాటు విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం నెట్స్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనడంతో అశ్విన్‌కు అయిన గాయం పెద్దది కాకపోవచ్చునని భావిస్తున్నారు. అయితే, ఈ గాయం ప్రభావం ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్‌పై ఉంటుందా? అన్నది ఇంకా కచ్చితంగా తెలియదు.
శనివారం కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌తో కలిసి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ పర్యవేక్షణలో క్యాచులు అందుకుంటూ.. విసురుతూ ఉన్న క్రమంలో కుడిమోకాలిపై పూర్తి బరువు వేసి పడటంతో అశ్విన్‌కు గాయమైంది. దీంతో బాధతో విలవిల్లాడిన అశ్విన్.. ప్రాక్టీస్ సెషన్‌ను మధ్యలోనే వదిలేసి విశ్రాంతి తీసుకున్నాడు. వెంటనే రంగంలోకి దిగిన ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్ అశ్విన్‌కు ఉపశమన చర్యలు చేపట్టాడు. ఫర్హార్ట్ సూచనల మేరకు కొంత కసరత్తు అనంతరం నెట్స్‌లో బౌలింగ్ సెషన్స్‌కు వచ్చిన అశ్విన్.. విస్తారంగా పాల్గొన్నాడు. దీంతో గాయం ప్రభావం అంతగా ఉండకపోవచ్చునని, మ్యాచ్‌లో అతను అందుబాటులో ఉంటాడని భావిస్తున్నారు.