
కెప్టెన్ కోహ్లీకి గంగూలీ కీలక సూచన!
లండన్: టీమిండియా తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో జట్టులోకి ఓ ఆటగాడిని తీసుకోవాలని కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఆసీస్ దిగ్గజం మైకెల్ క్లార్క్ సలహా ఇచ్చారు. అతడు మరెవరో కాదు ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో గత రెండు మ్యాచ్‌లలో జట్టులో చోటు దక్కించుకోని బౌలర్ అశ్విన్‌ను దక్షిణాఫ్రికాతో నేడు జరగనున్న కీలక మ్యాచ్‌లో తీసుకోవాలని కోహ్లీకి ఈ దిగ్గజాలు సూచించారు. దీంతో రవీంద్ర జడేజాను పక్కన పెడతారా అనే అనుమానాలు తలెత్తాయని దీనికి గంగూలీ క్లారిటీ ఇచ్చాడు.
'అశ్విన్ తో పాటు రవీంద్ర జడేజా జట్టులో ఉండటం కీలకమే. అయితే హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టి అశ్విన్‌ను తీసుకుని ఐదు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగితే టీమిండియాకు కలిసొస్తుంది. బ్యాటింగ్ గురించి ఎవరికీ ఆందోళన లేదు. లంక మ్యాచ్‌లో బౌలర్లు తేలిపోవడం వల్లే టీమిండియాకు ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అశ్విన్‌ను తీసుకుంటే భారత బౌలింగ్ మరింత పటిష్టమవుతుంది. ప్రధాన మ్యాచ్‌లలో ఒత్తిడికి గురికావడం సఫారీలకే అలవాటేనని' గంగూలీ అభిప్రాయపడ్డాడు. కోహ్లీకి గంగూలీ చేసిన సూచనకు ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ మద్దతు పలకడం గమనార్హం.