
మోదీకి ముడుపులు
ప్రధాని మోదీ అవినీతిపరుడని, ఆయన వ్యక్తిగత అవినీతికి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని, ఆయన అవినీతిపై తాను నోరు విప్పితే భూకంపమే వస్తుందంటూ...
• గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సహారా, బిర్లా సంస్థలు ఇచ్చాయి
• రాహుల్ చేసిన ‘భూకంపం’ ప్రకటన ఇదే
• స్వతంత్ర విచారణకు డిమాండ్
• రాహుల్ వ్యాఖ్యలు అవాస్తవం: బీజేపీ
మెహ్‌సానా: ప్రధాని మోదీ అవినీతిపరుడని, ఆయన వ్యక్తిగత అవినీతికి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని, ఆయన అవినీతిపై తాను నోరు విప్పితే భూకంపమే వస్తుందంటూ ఇటీవలి కాలంలో వరుసగా ఆరోపణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ‘ఆ భూకంపం వచ్చే’ ఆరోపణల వివరాలు తాజాగా వెల్లడించారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో బుధవారం జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. గుజరాత్ సీఎంగా ఉండగా మోదీకి ప్రముఖ వ్యాపార సంస్థలు సహారా గ్రూప్, బిర్లా గ్రూప్‌లు ముడుపులు చెల్లించాయని, అందుకు సంబంధించిన ఆధారాలు ఆదాయ పన్ను శాఖ వద్ద ఉన్నాయని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
‘అక్టోబర్ 2013, ఫిబ్రవరి 2014 మధ్య 9 సార్లు దాదాపు రూ.40 కోట్ల మేర సీఎంకు ముడుపులు చెల్లించినట్లుగా సహారా గ్రూప్ కార్యాలయాల్లో ఐటీ శాఖ నిర్వహించిన తనిఖీల్లో తేలింది. నవంబర్ 2014లో ఆ తనిఖీలు జరిగాయి. దాని ఆధారాలు ఐటీ శాఖ వద్ద ఉన్నాయి. ఆ సమయంలో గుజరాత్ సీఎంగా మోదీనే ఉన్నారు. అలాగే, మోదీ సీఎంగా ఉండగా ఆయనకు బిర్లా గ్రూప్ రూ. 12 కోట్లు ఇచ్చినట్లుగా కూడా ఐటీ వద్ద వివరాలున్నాయి. దీనిపై ఇంత వరకు ఎలాంటి విచారణ జరగకపోవడం ఆశ్చర్యకరం. ఇప్పటికైనా ఈ వివరాలపై స్వతంత్ర దర్యాప్తు జరగాలి’ అని రాహుల్ పేర్కొన్నారు.
పార్లమెంట్లో తనను మాట్లాడనివ్వడం లేదని, మోదీ అవినీతి గురించి తాను మాట్లాడితే భూకంపమే వస్తుం దంటూ గతవారం రాహుల్ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై బీజేపీ స్పందిస్తూ.. అవి నిరాధార, తప్పుడు, దురుద్దేశపూరిత ఆరోపణలని కొట్టివేసింది. హెలికాప్టర్ స్కామ్‌లో కాంగ్రెస్ పెద్దల పేర్లు బయటకు వస్తుండటంతో.. దృష్టిని మళ్లించడం కోసం ఈ ఆరోపణలు చేస్తున్నారంది. ప్రధాని మోదీ గంగానది అంత పవిత్రమైనవాడంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమర్ధించారు. రాహుల్ ఆరోపణలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందించారు. ఈ ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
దేశాన్ని క్యూల్లో నిలబెడ్తున్నారు..
బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘దేశ ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులపై, వారి నిజాయితీపై మీకు అనుమానాలు ఉన్నాయి. అందుకే వారిని క్యూల్లో నిలబెడుతున్నారు. ఇప్పుడు వారి తరఫున నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ముడుపులు అందాయన్నది నిజమా? కాదా? దీనిపై ఎప్పుడు విచారణ జరిపిస్తారు’ అని మోదీని రాహుల్ సూటిగా ప్రశ్నించారు. దీనిపై రెండున్నరేళ్లుగా విచారణ ఎందుకు జరగడం లేదని.. దేశం తరఫున తాను ప్రశ్నిస్తున్నానన్నారు. దీనిపై విచారణ జరపాలని ఐటీ కూడా సిఫారసు చేసిందని వెల్లడించారు. మోదీ తీసుకున్న నోట్ల రద్దుపైనా రాహుల్ విమర్శలు గుప్పించారు. పార్లమెంటు లో తనను మాట్లాడనీయలేదని, ప్రధాని తనముందు నిలబడటానికి కూడా సిద్ధంగా లేరన్నారు. నోట్ల రద్దు పేదలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమని ఆరోపించారు. కొన్ని నెలల పాటు పేదల డబ్బు బ్యాంకుల్లోనే ఉంచి.. వాటితో తనకు సన్నిహితులైన పెద్దల రుణాలను మాఫీ చేయడమే మోదీ ఉద్దేశమని స్పష్టం చేశారు. కాగా, ముడుపుల ఆరోపణలపై స్వతంత్ర విచారణకు మోదీ సిద్ధం కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
‘కామన్ కాజ్’ వేసిన పిటిషన్‌లోనివే..
మోదీ అవినీతికి సంబంధించి కామన్ కాజ్’ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లోనే రాహుల్ పేర్కొన్న అంశాలున్నాయి. సరైన సాక్ష్యాధారాలు లేవని, కేవలం ఆరోపణలనే ఆధారంగా తీసుకోలేమని గతవారం ఆ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించలేదు. సరైన ఆధారాలను సమర్పించాలని, ఆ తరువాతే పిటిషన్ విచారణార్హమా, కాదా అనేది నిర్ణయిస్తామని కోర్టు పేర్కొంది. ‘బిర్లా గ్రూప్ కార్యాలయాలపై అక్టోబర్ 2013లో ఐటీ శాఖ దాడులు చేసింది. ఆ సమయంలో ఆ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ శుభేందు అమితాబ్ ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌లలో కొన్ని వివరాలు బయటపడ్డాయి. ‘2012లో సీఎంకు 25 కోట్లు( 12 కోట్లు ఇచ్చాం)’ అనే ఎంట్రీ కూడా వాటిలో ఉంది’ అనే వివరాలు కూడా ప్రశాంత్ భూషణ్ కోర్టుకు అందించిన వివరాల్లో ఉన్నాయి. ఈ అంశాలను గతంలో కేజ్రీవాల్ కూడా పలు సందర్భాల్లో లేవనెత్తిన విషయం గమనార్హం.
మోదీ గంగానదిఅంతా పవిత్రం: బీజేపీ
రాహుల్ ఆరోపణలు నిరాధారమని.. మోదీ గంగానదిఅంతా పవిత్రమని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధమున్న అగస్టా కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఈ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాబర్ట్ వాద్రాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రాహుల్ ఎందుకు స్పందించరని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. ‘ప్రధానిపై రాహుల్ వ్యాఖ్యలను అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ నాయకులే రాహుల్ గాంధీని లైట్‌గా తీసుకుంటున్నారు’అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. రాహుల్ ఓ పార్ట్‌టైమ్ నాన్ సీరియస్ రాజకీయ నేత అని ఆయన విమర్శించారు.