వడోదర: రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు కొత్తగా నాలుగు రకాల రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. సాధారణ ప్రయాణికుల కోసం ఒకటి, రిజర్వుడు తరగతి ప్రయాణికుల కోసం మూడు రైళ్లను రెండు నెలల్లో ప్రవేశపెడతామన్నారు. ‘అంత్యోదయ తరగతి’ వారూ(పేదలు) రైల్లో ప్రయాణించాలన్న లక్ష్యమే ఈ కొత్త రైలు ప్రవేశపెట్టటానికి కారణమన్నారు. బుధవారం నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వే, ఎంఎస్ యూనివర్సిటీ ఆఫ్ బరోడాలు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి.
ప్రభు మాట్లాడుతూ..దూర ప్రయాణ రైళ్లకు కూడా 2 నుంచి 4 ‘దీన్ దయాళ్’ బోగీలను సాధారణ ప్రయాణం కోసం జతచేస్తామని చెప్పారు. పూర్తి మూడో తరగతి ఏసీతో కూడిన ‘హమ్‌సఫర్’ రైలు ఒకటి, గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే తేజస్ రైళ్లు, ఉదయ్ (ఉత్కష్ట్ డబుల్–డెక్కర్ ఏసీ యాత్రి) రైళ్లను రిజర్వుడు తరగతి కోసం తెస్తామన్నారు. ఉదయ్ రైళ్లు అత్యంత రద్దీ మార్గాల్లో రాత్రివేళల్లో నడుస్తాయన్నారు.