రైల్వేలో పట్టాలెక్కబోతున్న మరో సంస్కరణ
రైల్వేలో పట్టాలెక్కబోతున్న మరో సంస్కరణ
Published Mon, Dec 19 2016 12:39 PM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM
రైల్వేలో మరో రెండో అతిపెద్ద సంస్కరణ పట్టాలెక్కబోతోంది. 92 ఏళ్ల సంస్కృతికి చరమగీతం పాడుతూ రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపిన కేంద్రప్రభుత్వం, చార్జీల మార్పునకు ప్రత్యేక ఏజెన్సీ నియమించాలని యోచిస్తోంది. చార్జీల ప్రతిపాదనకు ఓ స్వతంత్ర ఏజెన్సీ నియమించాలని కోరుతూ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు కేబినెట్ను ప్రతిపాదించనున్నారట.
చైర్మన్తో కూడిన నలుగురు సభ్యుల డెవలప్మెంట్ అథారిటీని నియమించాలని రైల్వే ప్రతిపాదించింది. మంత్రి ఆమోదంతో ఈ వారంలోనే ఈ ప్రతిపాదన కేబినెట్ ముందుకు రాబోతుందట. వచ్చే వారంలోనే కేబినెట్ దీన్ని ఆమోదించబోతుందని తెలుస్తోంది. దీంతో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేసిన తర్వాత ఇదే రెండో అతిపెద్ద సంస్కరణ కాబోతుంది.
ఈ విషయంపై ఇప్పటికే రైల్వే శాఖ వివిధ మంత్రిత్వ శాఖల అభిప్రాయాలను, నీతి ఆయోగ్ కామెంట్లను కూడా స్వీకరించింది. ప్రయాణికులకు అందిస్తున్న సబ్సిడీలతో దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా పేరున్న రైల్వేలు రూ.33,000 కోట్ల నష్టాలను మూటకట్టుకుంటున్నాయి. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ, సీనియర్ అధికారులతో సురేష్ ప్రభు చర్చించారు. వారు కూడా దీనికి సానుకూలంగా ఉన్నట్టు అధికారులు చెప్పారు. మార్కెట్ డిమాండ్ బట్టి చార్జీల హేతుబద్దీకరణ చేపట్టనున్నట్టు రైల్వే తెలుపుతోంది.
Advertisement