జమ్మూకశ్మీర్ లో హైవేల మూసివేత
జమ్మూ: భారీ వర్షాలు, హిమపాతంతో జమ్మూకశ్మీర్ లో జనజీవన స్తంభించింది. మంచు బాగా కురుస్తుడడంతో పలు రహదారులు మూతపడ్డాయి. శ్రీనగర్-లెహ్, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారులను మూసివేశారు. గత 24 గంటలుగా వర్షాలు కురుస్తుండడంతో రామబాన్ జిల్లాలోని రామసో, మాగర్ కోటె ప్రాంతంలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ-శ్రీనగర్ హైవేను మూసివేయాల్సి వచ్చిందని, కశ్మీర్ లోయలోని ప్రజలకు వస్తువులు సరఫరా చేస్తున్న దాదాపు 500 వాహనాలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.
భారీ హిమపాతంతో శ్రీనగర్-లెహ్ రహదారిని మూసేశారు. రోడ్డు 2 అడుగుల మేర మంచు పేరుకుపోయిందని, దీంతో వాహనాలను అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు. అయితే వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.