
మోదీ చెప్పారు.. 'రోబో2.0'లో రజనీ చేశారు!
భారీ ఖర్చుతో అత్యంత గ్రాండ్‌గా సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ పెట్టింది పేరు.
భారీ ఖర్చుతో అత్యంత గ్రాండ్‌గా సినిమాలు తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ పెట్టింది పేరు. నిజానికి ఆయన సినిమాల్లో అత్యద్భుతమైన విదేశీ లోకేషన్లు కనువిందు చేస్తాయి. అయితే, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న 'రోబో 2.0' మాత్రం ఓ విశిష్టతను సంతరించుకోబోతున్నది. అదేమిటంటే ఈ సినిమా చిత్రీకరణ పూర్తిగా భారత్‌లోనే జరిగింది. అవును ఇది నిజం.
పలు మీడియా కథనాల ప్రకారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన కలల పథకం 'మేకిన్ ఇండియా' గురించి రజనీకాంత్‌తో పంచుకున్నారట. 'రోబో-2'ను పూర్తిగా భారత్‌లోనే చిత్రీకరించి.. ఈ పథకానికి ఒక ఉదాహరణగా నిలువాలని ఆకాంక్షించారట. మోదీ మాటను మన్నించిన తలైవా రజనీ... అన్నట్టుగానే '2.0' షూటింగ్ పూర్తిగా భారత్‌లోనే నిర్వహించారు. ఈ సినిమా షూటింగ్ చాలావరకు చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో జరిగింది.
సినిమా క్లైమాక్స్‌ను మాత్రం ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ మైదానంలో తీశారు. రూ. 400 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న '2.0'ను.. చైనా విఖ్యాత సినిమా 'క్రౌచింగ్ టైగర్.. హిడెన్ డ్రాగన్' స్థాయిలో తీయబోతున్నట్టు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ ప్రకటించింది. 'క్రౌచింగ్ టైగర్.. హిడెన్ డ్రాగన్' సినిమాకు 2000 సంవత్సరం ఆస్కార్ అవార్డు లభించింది. అత్యాధునిక 3డీ టెక్నాలజీతో.. వీఎఫ్‌ఎక్స్ అదనపు సాంకేతిక హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ- అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో పోటాపోటీగా తలపడుతున్న సంగతి తెలిసిందే.