
రాజీవ్ హంతకులు క్షమాభిక్షకు అనర్హులు
సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులకు క్షమాభిక్ష పొందే అర్హత లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఆ హత్య విదేశీయుల పాత్ర ఉన్న కుట్ర ఫలితమని పేర్కొంది. రాజీవ్ హత్య కేసులో దోషులుగా తేలి, జైలుశిక్ష అనుభవిస్తున్న శ్రీలంకకు చెందిన శ్రీహరన్ అలియాస్ మురుగన్, శాంతన్, రాబర్ట్ పియస్, జయకుమార్‌లతో పాటు, భారతీయులైన నళిని, రవిచంద్రన్, అరివులకు క్షమాభిక్ష ప్రసాదించి, జీవిత ఖైదునుంచి విముక్తి కల్పించాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్.. రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష ప్రసాదించడంపై కేంద్ర అభిప్రాయాన్ని ప్రధానన్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి వివరించారు. ‘వీరు మన మాజీ ప్రధానమంత్రిని చంపారు. ఇందులో విదేశీయుల కుట్ర ఉంది. వారికి క్షమాభిక్ష ఏంటి? వారి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి, గవర్నర్(తమిళనాడు) ఇద్దరూ తిరస్కరించారు’అని రంజిత్ వివరించారు. దోషుల్లో మురుగన్ తరఫున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ హాజరయ్యారు.
వాదనల సమయంలో జరిగిన చర్చ సందర్భంగా.. ‘నేరస్థుల మరణ శిక్షను మేం ఇప్పటికే జీవిత ఖైదుగా మార్చాం. ఇప్పుడు మళ్లీ మా తీర్పును రాష్ట్ర ప్రభుత్వం మార్చాలనుకుంటోంది. సీబీఐ దీన్ని సవాలు చేయొచ్చా? వారికి శిక్ష పడింది కూడా సీబీఐ దర్యాప్తుతోనే కదా!’ అని ధర్మాసనం ప్రశ్నిం చింది. మరోవైపు, ‘ఒక సారి మేం మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చిన తరువాత వారికి శిక్ష తగ్గించే విషయంలో అధికారం రాష్ట్రాలకు ఉంటుం ది. దోషులు ఇప్పటికే 23 ఏళ్లుగా జైళ్లోనే ఉన్నారని, అది చాలని తమిళనాడు ప్రభుత్వంవాదిస్తోంది. ఈ విషయంలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు?’అని కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్ర దర్యా ప్తు సంస్థలు విచారణ జరిపిన కేసుల్లో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే లేదాశిక్షను తగ్గించే అధికారం కేంద్రాలకు ఉంటుందా? లేక రాష్ట్రాలకు ఉంటుందా? అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది.