పోర్న్ వీడియోలు చూపించి రేప్.. ఆపై హత్య
గోవా పెర్ఫ్యూమర్ మోనికా ఘర్డే హత్యకేసులో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రాజ్‌కుమార్ సింగ్ ఆమెకు ముందుగా ఫోన్లో మూడు పోర్న్ వీడియో క్లిప్స్ చూపించి, ఆపై అత్యాచారం చేసి హతమార్చినట్లు గోవా పోలీసులు వెల్లడించారు. ఇంతకుముందు భావించినట్లుగా ఇది ఏదో అనుకోకుండా చేసిన హత్య కాదని.. ముందుగానే అతడు ప్లాన్ చేసుకుని మరీ హతమార్చాడని గోవా డీఐజీ విమల్ గుప్తా తెలిపారు. ఆరోజు జరిగిన పరిణామాలను ఆయన మీడియాకు వెల్లడించారు.
సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా నటించి అక్కడకు వచ్చిన రాజ్‌కుమార్ సింగ్ తలుపు తట్టాడు. మోనిక తలుపు తీయగానే బలవంతంగా లోనికి వచ్చి ఆమెను కత్తితో బెదిరించాడు. ఆమె అరిచేలోపే ఆమె నోరు నొక్కేసి.. బాత్రూంలోకి తీసుకెళ్లాడు. దాంతో ఆమె తీవ్రంగా భయపడి దాదాపుగా సగం స్పృహ కోల్పోయింది. తర్వాత ఆమెను మంచం మీద పడుకోబెట్టి రెండు చేతులు, కాళ్లు కట్టేశాడు. ఆమె ఏమీ చేయలేదని నిర్ధారించుకున్న తర్వాత డబ్బులు డిమాండ్ చేశౄడు. పర్సులో 4వేలు ఉండటంతో అవి తీసుకొమ్మని ఆమె చెప్పింది. అది చాలదని, మరింత ఇవ్వాలని డిమాండ్ చేయడంతో తన ఏటీఎం కార్డు తీసుకొమ్మని చెప్పడంతో పాటు పిన్ నెంబరు కూడా చెప్పేసింది. తర్వాత ఆమె సెల్‌ఫోన్ లాక్కుని, దాని పాస్‌వర్డ్ అడిగాడు. ఫోన్ తెరిచిన తర్వాత ఆమెకు బలవంతంగా మూడు పోర్న్ వీడియో క్లిప్స్ చూపించాడని డీఐజీ వెల్లడించారు. తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడన్నారు.
ఆ తర్వాత తాను ఆమెకు బాగా తెలుసు కాబట్టి పోలీసులకు ఫిర్యాదుచేస్తుందన్న భయంతో ఆమె పీక పిసికి, దిండుతో ఆమె ముఖం మీద కూడా నొక్కి చంపేసినట్లు గుప్తా తెలిపారు. మొట్టమొదటిసారిగా జూన్ 7వ తేదీన ఈ అపార్టుమెంటులో ఏవైనా ఖాళీ ఫ్లాట్లు ఉన్నాయా అని అడిగేందుకు మోనికా ఘర్డే అక్కడకు వచ్చారని, అప్పుడు ఆమెకు ఫ్లాట్ల వివరాలు చెప్పేటప్పుడే ఆమె పట్ల రాజ్‌కుమార్ సింగ్ ఆకర్షితుడయ్యాడని చెప్పారు. అప్పటినుంచి ఆమెను జాగ్రత్తగా గమనిస్తూ.. ఒక్కరే ఉంటున్నట్లు తెలుసుకున్నాడన్నారు. తన కారు కడిగేందుకు మోనిక అతడిని నియమించినప్పటి నుంచి ఆమెతో మాట్లాడటం పెంచాడు. అప్పటినుంచి ఆమె ఫ్లాట్‌లో అణువణువూ అతడికి తెలుసన్నారు. జూలై 22న అతడిపై మోనిక సహా పలువురి నుంచి ఫిర్యాదులు రావడంతో అతడిని ఉద్యోగం నుంచి తీసేశారు. దాంతోపాటు రెండు నెలల జీతం కూడా ఇవ్వలేదు. ఆమె కారణంగానే ఇదంతా జరిగిందని కక్ష పెంచుకుని.. ఆమె పట్ల వ్యామోహం, కక్ష రెండింటితో ఇలా చేశాడని పోలీసులు వివరించారు.