ఏటీఎంలో డబ్బు డ్రా చేసి.. దొరికేశాడు!
గోవాకు చెందిన పెర్ఫ్యూమ్ స్పెషలిస్టు మోనికా ఘర్డే హత్యకేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె డెబిట్ కార్డు దొంగిలించిన నిందితుడు.. దాంతో బెంగళూరులో డబ్బులు డ్రా చేయడంతో దొరికిపోయాడు. మోనికా ఇంతకుముందు ఉండే అపార్టుమెంటు ప్రాంగణంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. మోనికాను హత్య చేసినట్లు అతడు అంగీకరించాడని పోలీసులు అంటున్నారు. అతడు ఆమెను ఎందుకు చంపాడన్నది స్పష్టంగా తెలియకపోయినా, ఈ హత్యకేసులో ఇంకెవరూ లేరని.. అతడొక్కడే ఈ ఘాతుకానికి పాల్పడాడని ఒక నిర్ధారణకు వచ్చారు.
ప్రస్తుతానికి బెంగళూరులోనే ఉన్న రాజ్‌కుమార్‌ను గోవా పోలీసుల కస్టడీకి ఇచ్చిన తర్వాత అతడిని గోవాకు తరలిస్తారు. హత్యకు కారణం ఏంటో తెలుసుకోడానికి అతడిని విచారిస్తామని పోలీసులు తెలిపారు. అలాగే బాధితురాలిపై అత్యాచారం జరిగిందో లేదో తెలుసుకోడానికి నిర్వహించిన పరీక్షల ఫలితాలు కూడా సోమవారం వెల్లడవుతాయని పోలీసులు భావిస్తున్నారు. మోనికా ఒక ఫొటోగ్రాఫర్‌ను పెళ్లి చేసుకుని 2011లో గోవాకు వెళ్లిపోయింది. అయితే గత ఏడాది నుంచి ఆమె తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఆమెకు ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.