గుత్తి: అమాయకులను మోసం చేసి వారి బ్యాంక్ ఖాతాల్లోని నగదును ఏటీఎంల ద్వారా అపహరిస్తున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను గుత్తి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ శ్యామరావు వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన విజయకుమార్ నాయక్, తనకల్లు మండలం ఏనుగుండుతండా గ్రామానికి చెందిన శ్రీకాంత్ నాయక్ జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెరలేపారు.
ఏటీఎంల వద్ద మకాం వేసి నగదు తీయడం రాని అమాయకులకు సాయం చేస్తున్నట్లుగా నటిస్తూ పిన్ నంబర్ తెలుసుకున్న తర్వాత డూప్లికేట్ ఏటీఎం కార్డు ఇచ్చి ఒరిజనల్ కార్డు దాచేస్తారు. అనంతరం ఆ కార్డులోని నగదును అపహరిస్తారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం గుత్తిలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద అమాయకుడిని మోసం చేసి కాజేసిన ఏటీఎం కార్డుతో డబ్బు డ్రా చేస్తుండగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలో ఇదే తరహాలో పలువురిని మోసం చేసినట్లు వెలుగు చూసింది. నిందితుల నుంచి రూ.75వేల నగదు, 14 ఏటీఎం కార్డులు, మూడు సెల్‌ఫోన్లు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
(చదవండి: ప్రియుడే కాలయముడు)
Comments
Please login to add a commentAdd a comment