
టాప్ హీరోకు రాజ్ నాథ్ సింగ్ ప్రశంసలు
న్యూఢిల్లీ: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్షయ్ కుమార్ పై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. అమర జవాన్ల కుటుంబాలకు సహాయం చేయడానికి ముందు వచ్చిన ‘రుస్తుం’ స్టార్ ను ఎంతో మెచ్చుకున్నారు. ‘అక్షయ్ కుమార్ దాతృత్వం ఎంతో కొనియాడదగింది. ఆయన చేసిన సాయం అమర జవాన్ల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంది. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన జవాన్లకు సహాయం అందించడం ద్వారా ఆయన ప్రేరణగా నిలిచారు. అక్షయ్ చూపిన చొరవ దేశంపై ఆయనకున్న అభిమానం, భక్తిని వెల్లడిస్తోంది. ముఖ్యంగా సీఆర్పీఎఫ్ పట్ల ఆయనకు అమిత గౌరవం ఉంద’ని ప్రశంసించారు.
ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా ప్రాంతంలో మావోయిస్టుల దాడిలో వీరమరణం పొందిన ఒక్కో సీఆర్‌పీఎఫ్ జవాను కుటుంబానికి రూ.9 లక్షల చొప్పున నగదును (మొత్తంగా కోటీ ఎనిమిది లక్షలు) అక్షయ్ కుమార్ అందజేశారు. మార్చి 11న మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 12 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.