ముందు మాట్లాడాల్సింది ఎవరు?
పెద్దల సభగా పేరొందిన రాజ్యసభలో సోమవారం ఓ విచిత్రమైన వివాదం చోటుచేసుకుంది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని కిష్ట్వార్ అల్లర్ల విషయమై ముందుగా ఎవరు మాట్లాడాలనే విషయం మీద ప్రతిపక్షానికి, అధికార పక్షానికి తీవ్ర వాగ్వాదం జరిగింది. జమ్ములో అల్లర్లు చెలరేగిన ఆ ప్రాంతానికి వెళ్లేందుకు రాజ్యసభలో విపక్షనేత అరుణ్ జైట్లీ ప్రయత్నించగా, అక్కడి ప్రభుత్వం అందుకు అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై జైట్లీ ఉదయం 11 గంటలకు సభలో ప్రకటన చేయాల్సి ఉంది. కానీ, ఆయన ఆ అంశాన్ని ప్రస్తావించగానే తెలంగాణ, కేరళ సోలార్ స్కాం తదితర అంశాలపై గందరగోళం చెలరేగింది. రెండోసారి సమావేశమైన తర్వాత ఉప సభాపతి పీజే కురియన్, జైట్లీకి అవకాశమిచ్చారు.
కానీ, దీనిపై ప్రభుత్వం ఓ ప్రకటన చేస్తుందంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లా.. జైట్లీకి అడ్డుపడ్డారు. దీనికి బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు అభ్యంతరం తెలిపి, విపక్ష నాయకుడికి ముందుగా మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. ఆ వాదనతో కురియన్ ఏకీభవించారు. కానీ, ఆర్థికమంత్రి చిదంబరం జోక్యం చేసుకుని.. ప్రభుత్వమే ముందు ప్రకటన చేయాలన్నారు. కొత్త సంప్రదాయాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అధికార పక్షమే ముందు మాట్లాడాలని చెప్పారు.
అధికార, విపక్షాలు దీనిపై వాదులాడుకుంటుండగా, బీఎస్పీ సభ్యులు తమకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ గందరగోళం నడుమ కురియన్ సభను మరో అరగంట వాయిదా వేశారు. మొత్తమ్మీద ఎవరు మాట్లాడాలనే అంశంపై ఎవరూ మాట్లాడకుండానే సభ వాయిదా పడింది.