
'మార్పు కోరుతున్న హస్తిన ప్రజలు'
న్యూఢిల్లీ: గత పాలకులు 16 ఏళ్లుగా న్యూఢిల్లీని భ్రష్టుపట్టించారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. దీంతో దేశ రాజధాని హస్తిన అస్థిరతతో సతమతమవుతోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేసి గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ ప్రజలను విజ్ఞప్తి చేశారు.గత పాలకులు హస్తినకు అంటించిన మురికిని బీజేపీ ఐదేళ్లలో వదలకొడుతుందని అన్నారు
బుధవారం న్యూఢిల్లీలో జరిగిన ఎన్నికల ర్యాలీలలో మోదీ ప్రసంగించారు. ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కిరణ్ బేడీ నేతృత్వంలో న్యూఢిల్లీ అభివృద్ధి ప్రారంభమవుతుందని అన్నారు. న్యూఢిల్లీలో పూర్తి స్థాయి బలమున్న పార్టీ అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.
70 స్థానాలు గల న్యూఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల 7 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో న్యూఢిల్లీలో ప్రధాన రాజకీయ పార్టీలు ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి.