
సన్యాసం చాలు.. పదవులొద్దు!!
కేబినెట్ మంత్రి హోదా ఇస్తామన్న హర్యానా ఆఫర్ను యోగా గురువు రాందేవ్ బాబా తిరస్కరించారు.
కేబినెట్ మంత్రి హోదా ఇస్తామన్న హర్యానా ఆఫర్ను యోగా గురువు రాందేవ్ బాబా తిరస్కరించారు. తాను సన్యాసిగానే ఉంటాను తప్ప.. పదవులేవీ వద్దన్నారు. తన గౌరవార్థం హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సోనేపట్లో ఏర్పాటుచేసిన ఓ పెద్ద కార్యక్రమంలో ఆయనీ విషయం చెప్పారు. ''నేను సన్యాసిని. మానవాళికి సేవచేయడం ఒక్కటే నా ఏకైక లక్ష్యం. నేను ఎలాంటి మంత్రి పదవులు, హోదాల కోసం ఆశించడం లేదు. బాబా గాను, ఫకీరుగానే ఉండిపోవాలనుకుంటున్నాను'' అని ఆయన చెప్పారు.
అయితే, రాందేవ్ బాబాకు మంత్రి హోదా, అందుకు సంబంధించిన గౌరవ మర్యాదలు కల్పించాలంటే న్యాయపరమైన చిక్కులు ఎదురు కావచ్చని హర్యానా ప్రభుత్వం అనుమానించింది. అందుకే సోమవారం సాయంత్రమే చేయాల్సిన ప్రకటనను కూడా ఆపేసింది. కాగా, రాందేవ్ బాబాను ప్రసన్నం చేసుకోడానికి ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ పాలక బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది.