లాలు కొడుకుతో పెళ్లి వార్తలు అబద్ధం
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ కుటుంబంతో పెళ్లిసంబంధం విషయం మాట్లాడినట్టు వచ్చిన వార్తలను ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ తోసిపుచ్చారు. లాలు పెద్ద కొడుకు, బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు తన మేనకోడల్ని ఇచ్చి పెళ్లి చేయనున్నట్టు వచ్చిన కథనాలు అవాస్తవమని రాందేవ్ చెప్పారు. ఓ వర్గానికి చెందిన మీడియా ఈ కట్టుకథల్ని ప్రచారం చేసిందని విమర్శించారు.
గురువారం రాత్రి పట్నా వచ్చిన రాందేవ్.. లాలుతో సమావేశమయ్యారు. దీనిపై రాందేవ్ మాట్లాడుతూ.. లాలుకు అస్వస్థతగా ఉందని తెలియడంతో ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లానని చెప్పారు. అంతేకాని పెళ్లి సంబంధం లేదా పెద్ద నోట్ల రద్దుపై రాజకీయాల గురించి తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. లాలు దేశ సంపదని, ఆయన ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని రాందేవ్ అన్నారు.