ఆ ఎమ్మెల్యేపై బాధితురాలి వాట్సప్ మెసేజ్!
తనపై అత్యాచారం చేసిన ఎమ్మెల్యే బెయిల్ పై విడుదల కావడంతో తాను, తన కుటుంబం భయంభయంగా బతుకుతున్నామని, తనను, తన కుటుంబాన్ని అతను హతమార్చే అవకాశముందని బాధితురాలు వాట్సప్ మెసేజ్ లో తెలిపింది. అధికార ఆర్జేడీ పార్టీకి చెందిన బిహార్ ఎమ్మెల్యే రాజ్ బలభ్ యాదవ్ నాగాలాండ్ కు చెందిన అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నలంద స్కూల్ లో పదో తరగతి చదువుతున్న అమ్మాయిని అతడు రేప్ చేశాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆర్జేడీ అతన్ని పార్టీ నుంచి బహిష్కరించింది.
ఇటీవల బాధితురాలు పదో తరగతి పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరు నెలల జైలలో ఉన్న నిందితుడు రాజ్ బలభ్ యాదవ్ కు పట్నా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఎమ్మెల్యే యాదవ్ కు బెయిల్ రావడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తూ బాధితురాలు వాట్సాప్ ద్వారా మీడియాకు ఓ సందేశం పంపించారు. 'అతను జైలు నుంచి బయటకు వచ్చాడు. నా కుటుంబ రక్షణ గురించి నాకు భయం కలుగుతోంది. నాపై జరిగిన దారుణానికి నేను ఇప్పటికే చనిపోయాను. ఇంకా నేను కోల్పోయేదేమీ లేదు' అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 'శక్తిమంతుడైన యాదవ్ ముందు నేను, నా కుటుంబం పెద్ద లెక్క కాదు. అతను నన్ను, నా కుటుంబాన్ని ఎప్పుడైనా చంపగలడు. పోలీసులే అతన్ని చూస్తే భయపడతారు' అంటూ ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది.