'రేపిస్టు బడా నేత బయటకొచ్చాడు.. భయంగా ఉంది'
పట్నా: తనపై లైంగిక దాడికి పాల్పడిన పవర్ ఫుల్ రాజకీయనాయకుడు బెయిల్ పై బయటకొచ్చాడని, ఇప్పుడు తనకు చాలా భయంగా ఉందని, తన కుటుంబాన్ని నాశనం చేస్తాడేమోనని బెంబేలెత్తిపోతున్నానని ఓ పది హేనేళ్ల బాలిక బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు విజ్ఞప్తి చేసుకుంది. అతడు చాలా పలుకుబడి ఉన్న నాయకుడని, ఎవ్వరినైనా ఏమైనా చేయగలడని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఆర్జేడీలోని శక్తిమంతమైన నాయకుల్లో ఒకరైన రాజ్ బల్లాబ్ యాదవ్ పదో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఓ మహిళ ద్వారా ఆ అమ్మాయిని అటకాయించి ఈ దారుణానికి దిగాడు.
అనంతరం బాలికకు రూ.30 వేలు తీసుకొమ్మని ఆఫర్ చేశాడు. అయితే, తనపై దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించిన బాలిక ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. నెల రోజులపాటు పరారీలో ఉన్న రాజ్ బల్లాబ్ అనంతరం లొంగిపోగా జైలులో వేసి విచారిస్తున్నారు. అతడికి ఇటీవలె గత శనివారం బెయిల్ వచ్చి బయటకొచ్చాడు. ఈ నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురైన బాధిత బాలిక వాట్సాప్ ద్వారా తన విజ్ఞప్తిని ముఖ్యమంత్రి నితీశ్ కు చేయాలంటూ జర్నలిస్టులకు, ఇతర ప్రముఖ వ్యక్తులకు సమాచారం పంపించింది. ఆ బాలిక వాట్సాప్ లో ఏం పంపించిందంటే..
'నాపై అత్యాచారానికి పాల్పడిన యాదవ్ జైలు నుంచి బయటకొచ్చాడు. నేను ఇప్పుడు నా కుటుంబం గురించి చాలా భయపడుతున్నాను. వారికి ఏదైనా జరుగుతుందేమో. నాకు జరిగిన సంఘటనతో ఇప్పటికే నేను చచ్చిపోయిన దాన్ని. నేను కోల్పోయేందుకు ఇంకేం లేదు. అతడు నన్ను నా కుటుంబాన్ని ఏక్షణంలో నైనా చంపగలడు. అతడికి పోలీసులు కూడా భయపడుతున్నారు' అంటూ ఆ బాలిక మొరపెట్టుకుంది. కాగా, రాజ్ కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్లింది. దానిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ ఘటన అనంతరం రాజ్ ను ఆర్జేడీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ పగతో అతడు తన కుటుంబాన్ని ఏమైనా చేస్తాడేమోనని బాలిక భయపడుతోంది.