కొత్త నోట్ల సప్లై వారికి పెంచండి: ఆర్బీఐ
కొత్త నోట్ల సప్లై వారికి పెంచండి: ఆర్బీఐ
Published Tue, Jan 3 2017 3:21 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM
ముంబై : పెద్ద నోట్ల రద్దు అనంతరం తీసుకొచ్చిన కొత్త కరెన్సీ నోట్ల సరఫరాను గ్రామాలకు పెంచాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. దూర ప్రాంతాలకు సప్లై చేసే కరెన్సీ నోట్లపై కరెన్సీ చెస్ట్లు(నోట్లను భద్రపరిచే స్థలం) రోజువారీ రిపోర్టు చేయాలని పేర్కొంది. అవసరానికి తగ్గ నోట్ల సరఫరా గ్రామాలకు చేయడం లేదని గుర్తించిన సెంట్రల్ బ్యాంకు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కనీసం 40 శాతం బ్యాంకు నోట్లను గ్రామాలకు సరఫరా చేయాలని బ్యాంకులను ఆదేశిస్తూ బ్యాంకింగ్ రెగ్యులేటరీ ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. అవసరాల మేరకు ఈ విధానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయాలని బ్యాంకులకు సూచించింది.
ఆర్ఆర్బీ, డీసీసీబీ, కమర్షియల్ బ్యాంకుల గ్రామీణ కార్యాలయాల్లో బ్యాంకులు తమ కరెన్సీ చెస్ట్లను తగినంత ఏర్పాటుచేసుకోవాలని సూచిస్తున్నట్టు పేర్కొంది. రూరల్ బ్రాంచ్లకు గ్రామీణ ప్రాంతాల్లో అవసరాలు జిల్లా జిల్లాకు తేడాలుంటాయని పేర్కొంది. అదేవిధంగా తక్కువ విలువ కల్గిన నోట్లనూ రూరల్ సెంటర్లకు, గ్రామాలకు సరఫరా చేయాలని బ్యాంకు కరెన్సీ చెస్ట్లను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశించింది. రూ.500, అంతకంటే తక్కువ విలువ కలిగిన నోట్లను చెస్ట్లు జారీచేస్తున్నాయి. రూ.100 కంటే తక్కువ విలువ కలిగిన నోట్లనూ కరెన్సీ చెస్ట్లు స్వేచ్ఛగా జారీచేయాలని ఆర్బీఐ పేర్కొంది.
Advertisement