నోటుపై ఆర్బీఐ చెప్పిన కొత్త కబురు
- త్వరలోనే కొత్త 50 రూపాయల నోటు విడుదల
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) త్వరలోనే కొత్తగా 50 రూపాయల నోటును విడుదల చేయనుంది. సరికొత్తగా తీసుకురానున్న ఈ 50 రూపాయల నోటుపై నంబర్ ప్యానెల్‌లో రెండువైపులా 'ఎల్' అనే ఆంగ్ల అక్షరం ఉంటుందని, దీనిపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం కూడా ఉంటుందని ఆర్బీఐ సోమవారం తెలిపింది. అలాగే నంబర్ ప్యానెల్‌లో అంతర్గతం 'ఆర్' అనే అక్షరం కూడా ఉంటుందని చెప్పింది. అయితే, కొత్తగా 50 రూపాయల నోటు తీసుకువస్తున్నప్పటికీ, ఇప్పటివరకు చలామణిలో ఉన్న పాత రూ. 50 నోట్లను రద్దు చేయబోమని స్పష్టం చేసింది. మహాత్మాగాంధీ 2005 సిరీస్‌లో భాగంగా తీసుకొస్తున్న ఈ కొత్త 50 రూపాయల నోటుపై 2016 సంవత్సరం ముద్రించి ఉంటుందని తెలిపింది.
పెద్దనోట్ల రద్దుతో దేశమంతటా నగదుకు తీవ్ర కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగదు సరఫరాను పెంచేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చిల్లర కొరత నేపథ్యంలో రూ. 500 నోటు ముద్రణపై ఇప్పుడు అధిక దృష్టి కేంద్రీకరిస్తామని, ఇక నుంచి 500నోట్లు అధికంగా విడుదల చేస్తామని ఆర్బీఐ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.