
ఏకాభిప్రాయం వచ్చినట్లే!
భూ బిల్లుపై దిగ్విజయ్
కొనసాగుతున్న తెరచాటు చర్చలు
వ్యాపమ్‌లో నా పాత్ర ఏమీ లేదు
న్యూఢిల్లీ: వివాదాస్పద భూసేకరణ చట్ట సవరణ బిల్లులోని కొన్ని అంశాలపై సూత్రప్రాయంగా ఏకాభిప్రాయం వచ్చినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ శనివారం లక్నోలో తెలిపారు. బిల్లుపై పలు పార్టీలతో తెరచాటు చర్చలు కొంతమేరకు సత్ఫలితాలిచ్చాయన్నారు. భూసేకరణపై పార్లమెంట్ సంయుక్త కమిటీలో సభ్యుడైన దిగ్విజయ్ ఏ అంశాలపై ఏకాభిప్రాయం వచ్చిందో మాత్రం చెప్పలేదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో సమావేశమైన దిగ్విజయ్.. జీఎస్టీ బిల్లుపై కూడా మాట్లాడారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రయత్నించినప్పుడు బీజేపీ దాన్ని అడ్డుకుందని.. ఇప్పుడు ఆర్థిక వృద్ధిరేటులో ఒకటిన్నరశాతం నష్టం కలుగుతోందని సన్నాయి నొక్కులు నొక్కుతోందని ఆరోపించారు.
వ్యాపమ్‌లో నా పాత్రేమీ లేదు..
కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపమ్ స్కాంలో తన పాత్ర ఉందంటూ బీజేపీ చేసిన ఆరోపణలను దిగ్విజయ్ కొట్టిపారేశారు. తన హయాంలో ఏ ఒక్క నిబంధన ఉల్లంఘన కూడా జరగలేదన్నారు. మంత్రిమండలిలో హేతుబద్ధమైన చర్చ అనంతరం నిర్ణయం తీసుకున్న తరువాతే ఆ నియమాలను అనుసరించి నియామకాలు జరిగాయన్నారు.
వ్యాపమ్ లో దిగ్విజయ్‌కీ భాగం ఉంది: బీజేపీ
భోపాల్: వ్యాపమ్ స్కాంలో మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేసిన దిగ్విజయ్‌సింగ్‌కు కూడా పాత్ర ఉందని బీజేపీ ఆరోపించింది. 1993-2003మధ్య దిగ్విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నియమాలను గాలికి వదిలేసి వివిధ శాఖల్లో 16 నియామకాలు చేశారని బీజేపీ మధ్యప్రదేశ్ శాఖ అధ్యక్షుడు నందకుమార్ సింగ్ శనివారం ఆరోపించారు. ఈ వ్యవహారంలో దిగ్విజయ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఆయన అన్నారు. 1997 సెప్టెంబర్ 27న దిగ్విజయ్ చేసిన సంతకాలతో కూడిన 16 నియామకాల నోట్‌షీట్లను ఆయన విలేకరులకు చూపించారు.