ఒక్క పాయింట్‌లో రికార్డు మిస్
ఒక్క పాయింట్ తేడాతో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఆల్‌టైమ్ రికార్డుస్థాయిని మిస్సయ్యింది. పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ గురువారం ట్రేడింగ్ ముగింపు సమయంలో 21,205.44 పాయింట్ల స్థాయికి పరుగులు పెట్టింది. అయితే 2008 జనవరి 10న నెలకొల్పిన 21,206.77 పాయింట్ల రికార్డును అధిగమించలేకపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 130 పాయింట్లు లాభపడి 21,164 వద్ద క్లోజయ్యింది. ఇది సెన్సెక్స్‌కు కొత్త క్లోజింగ్ రికార్డు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మూడేళ్ల విరామం తర్వాత తొలిసారిగా 6,300 స్థాయిని అధిగమించి, 6,309 వద్దకు చేరింది. చివరకు 47 పాయింట్ల పెరుగుదలతో 6,299 వద్ద ముగిసింది. ఎఫ్‌ఐఐలు రూ. 1875 కోట్ల పెట్టుబడి చేయగా, రూ. 834 కోట్ల విలువైన షేర్లను దేశీయ సంస్థలు విక్రయించాయి. 2008 జనవరి 8ననెలకొల్పిన 6,357 పాయింట్ల రికార్డుస్థాయిని నిఫ్టీ ఇంకా బద్దలు చేయాల్సివుంది. 2010 నవంబర్ 5న 6,312 పాయింట్ల గరిష్ట ముగింపు రికార్డుకు నిఫ్టీ మరో 13 పాయింట్ల దూరంలో వుంది.
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని కొనసాగించనున్నట్లు గత రాత్రి ప్రకటించినా, ఇతర ప్రపంచ మార్కెట్లు లాభాల స్వీకరణ ఫలితంగా క్షీణించాయి. కానీ స్థానిక మార్కెట్లో అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టులకు ముగింపురోజైనందున, ట్రేడింగ్ చివరి అరగంటలో పెద్ద ఎత్తున షార్ట్ కవరింగ్ జరిగిందని, దాంతో సూచీల ర్యాలీ సాధ్యపడిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. గత మూడురోజుల్లో సెన్సెక్స్ 594 పాయింట్లు లాభపడింది. ఒక్క అక్టోబర్ నెలలో భారీగా 1,785 పాయింట్ల ర్యాలీ జరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్‌ల ఫలితాలు మార్కెట్‌ను పాజిటివ్‌గా ఆశ్చర్యపర్చడంతో పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు భారీ ట్రేడింగ్ పరిమాణంతో ర్యాలీ జరిపాయి.
భారీ టర్నోవర్
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ రెండు ఎక్స్ఛేంజీల్లో నగదు, డెరివేటివ్ విభాగాల్లో కలిపి భారీగా రూ. 5.33 లక్షల కోట్ల టర్నోవర్ జరిగింది. భారత్ స్టాక్ మార్కెట్లో ఇంత పెద్ద ఎత్తున టర్నోవర్ నమోదుకావడం ఇదే ప్రధమం.
సెన్సెక్స్ పెరిగినా, సంపద పోయింది....
బీఎస్‌ఈ సెన్సెక్స్ 1.33 పాయింట్ల తేడా మినహా రికార్డుస్థాయికి చేరువైనా, ఇన్వెస్టర్ల సంపద మాత్రం మూడేళ్ల క్రితంకంటే ఇప్పుడు రూ. 10 లక్షల కోట్లు తగ్గింది. లిస్టెడ్ కంపెనీల ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 68,44, 774 కోట్లకు చేరింది. 2010 నవంబర్ 5న సెన్సెక్స్ 21,005 పాయింట్ల వద్ద ముగిసినపుడు ఆ విలువ రూ. 77,28,600 లక్షల కోట్లు వుండేది. ఇప్పటివరకూ ఆ విలువే భారత్‌లో రికార్డు.