రెండు దశాబ్దాల్లో ఇదే అత్యధిక పోలింగ్
ఎన్నికల సంఘం తీసుకున్న పకడ్బందీ చర్యల వల్ల నంద్యాల ఉప ఎన్నిక ఒకటి రెండు స్వల్ప సంఘటనలు
- నంద్యాల ఉప ఎన్నికపై సీఈవో భన్వర్‌లాల్
- స్వల్ప సంఘటనలు మినహా అంతా ప్రశాంతం
- దాదాపు 80 శాతం పోలింగ్ నమోదు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంఘం తీసుకున్న పకడ్బందీ చర్యల వల్ల నంద్యాల ఉప ఎన్నిక ఒకటి రెండు స్వల్ప సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) భన్వర్‌లాల్ చెప్పారు. ఈ ఉప ఎన్నికలో పోలింగ్ రికార్డు స్థాయిలో దాదాపు 80 శాతానికి చేరిందని, గత రెండు దశాబ్దాల్లో ఇదే గరిష్టమని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన వివరాలను ఆయన బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మీడియాకు వివరించారు. ఆయన ఏం చెప్పారంటే...‘‘నంద్యాల నియోజకవర్గంలో 2009లో 76 శాతం, 2014 సాధారణ ఎన్నికల్లో 71 శాతం పోలింగ్ నమోదైంది.
ప్రస్తుత ఉప ఎన్నికలో సాయంత్రం 5 గంటల వరకు 76 శాతం మందిపైగా ఓట్లు వేశారు. పోలింగ్ ముగిసేటప్పటికి ఇది దాదాపు 80 శాతానికి చేరింది. ఒకటి రెండు స్వల్ప సంఘటనలు మినహా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనావళిని పాటించాయి. కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలింగ్ రోజు వరకూ దాదాపు రూ.1.2 కోట్ల నగదు జప్తు చేశాం. 72 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 62 చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం వల్ల అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలింగ్ ముగిసింది. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి రాజకీయ పార్టీలు, మీడియా సహకరించాయి. అందరికీ ధన్యవాదాలు’’ అని భన్వర్‌లాల్ పేర్కొన్నారు.
నియమావళి ఉల్లంఘనలపై విచారణ
ఉప ఎన్నిక ప్రచారంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం పట్ల కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాల విష యంలో మేము ఏ అంశాన్నీ తొక్కి పెట్టలేదు. 21వ తేదీ సాయంత్రం 8 గంటలకు మాకు ఎన్నికల సంఘం నుంచి లేఖ అందింది. దీనిపై వెంటనే రిటర్నింగ్ అధికారికి డైరెక్టన్ (సూచన) ఇచ్చాం. 22వ తేదీన రిటర్నింగ్ అధికారి పోలింగ్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నందు న 23వ తేదీన చర్యలు తీసుకున్నారు. అంతా ప్రొసీజర్ (పద్ధతి) ప్రకారమే జరిగింది. ఎన్ని కల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై అన్ని పార్టీల నేతలూ ఫిర్యాదులు చేశారు. వాటిపై విచారణ జరిపించి నిర్ణయం తీసుకుంటాం’’ అని భన్వర్‌లాల్ చెప్పారు.
28న ఓట్ల లెక్కింపు
‘‘నంద్యాలలో ఈ నెల 28వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. లెక్కింపు కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తాం. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నానికల్లా తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది’’ అని భన్వర్‌లాల్ వెల్లడించారు.