లైంగిక వేధింపుల కేసులో శశికళకు ఊరట!
న్యూఢిల్లీ: అమ్మ జయలలిత ఆగ్రహానికి గురై.. అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించబడిన ఎంపీ శశికళ పుష్పకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. శశికళ, ఆమె కుటుంబంపై పనిమనిషి నమోదుచేసిన లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఎంపీ శశికళ, మరో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వుల్ని ఇచ్చింది.
రాజ్యసభ ఎంపీ అయిన శశికళ, ఆమె భర్త, కొడుకుపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని హైకోర్టు బుధవారం తమిళనాడు ప్రభుత్వాన్నికి ఆదేశించిన సంగతి తెలిసిందే. శశికళ ఇంట్లో పనిచేస్తున్న పనిమనుషులు ఆమెకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గతంలో శశికళ పుష్ప ఇంట్లో పనిచేస్తున్న ఏడుగురు వేర్వేరు కారణాలతో మరణించిన వ్యవహారం ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తున్నది. దీనికితోడు పనిమనుషులు వేధింపుల కేసును నమోదుచేశారు. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్ప రాజ్యసభ వేదికగా అమ్మ జయలలితకు వ్యతిరేకంగా తీవ్ర ఆరోపణల్ని సందించిన విషయం తెలిసిందే. తనకు ప్రాణ హానీ ఉందంటూ రాజ్య సభలో కన్నీళ్లు పెట్టి, ఢిల్లీలోని తన ఇంటికి భద్రతను కల్పించుకున్నారు. పదవికి రాజీనామా చేయాలని అమ్మ ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి, రాష్ట్రం వైపుగా తొంగిచూడకుండా, ఢిల్లీలోనే తిష్ట వేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై ఒత్తిడి పెంచేదిశగా అన్నాడీఎంకే వర్గాలు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.
తమనంటే, తమను శశికళ పుష్ప మోసం చేశారంటూ ఫిర్యాదులు చేశారు. ఆమె భర్త లింగేశ్వర తిలగం, కుమారుడు పృద్వీరాజ్‌లపై కూడా ఫిర్యాదులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాంట్రాక్టులు, ఉద్యోగాల పేరిట లక్షలు దండుకున్నారంటూ కొందరు, తమను వేధించారంటూ మరికొందరు, తమ మీద దాడులకు పాల్పడ్డారంటూ ఇంకొందరు.. ఇలా ఫిర్యాదుల వేగం పెరగడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న శశికళ పుష్ప కుటుంబం కోర్టును ఆశ్రయించింది.