
ఉక్కిరి బిక్కిరి..
అమ్మ ఆజ్ఞను ధిక్కరించిన అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్ప మెడకు ఉచ్చు బిగుస్తున్నది. ఆమెను ఉక్కిరి బిక్కిరిచేస్తూ ఫిర్యాదులు
సాక్షి, చెన్నై : అమ్మ ఆజ్ఞను ధిక్కరించిన అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్ప మెడకు ఉచ్చు బిగుస్తున్నది. ఆమెను ఉక్కిరి బిక్కిరిచేస్తూ ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. గతంలో శశికళ పుష్ప ఇంట్లో పనిచేస్తున్న ఏడుగురు వేర్వేరు కారణాలతో మరణించిన వ్యవహారం కూడా ఆమె వైపునకు మళ్లి ఉన్నది. ఫిర్యాదులు హోరెత్తుతుండటంతో ఇక, దేశ రాజధాని నగరం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి.
అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్ప రాజ్యసభ వేదికగా అమ్మ జయలలితకు వ్యతిరేకంగా తీవ్ర ఆరోపణల్ని సందించిన విషయం తెలిసిందే. తనకు ప్రాణ హానీ ఉందంటూ రాజ్య సభలో కన్నీళ్లు పెట్టి, ఢిల్లీలోని తన ఇంటికి భద్రతను కల్పించుకున్నారు. పదవికి రాజీనామా చేయాలని అమ్మ ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి, రాష్ట్రం వైపుగా తొంగిచూడకుండా, ఢిల్లీలోనే తిష్ట వేసి ఉన్నారు. ఈ సమయంలో ఆమె మెడలు వంచే దిశగా అన్నాడీఎంకే వర్గాలు పయనం రాష్ట్రంలో సాగుతున్నది. ఇందుకు అద్దం పట్టే విధంగా పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.
తమనంటే, తమను శశికళ పుష్ప మోసం చేశారంటూ కొందరు, మరి కొందరి ద్వారా ఆమె భర్త లింగేశ్వర తిలగం, కుమారుడు పృద్వీరాజ్‌లపై కూడా ఫిర్యాదులు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. కాంట్రాక్టులు, ఉద్యోగాల పేరిట లక్షలు దండుకున్నారంటూ కొందరు, తమను వేధంచారంటూ మరి కొందరు, తమ మీద దాడులకు పాల్పడ్డారంటూ ఇంకొందరు... ఇలా ఫిర్యాదుల వేగం పెరగడంతో ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి శశికళ పుష్పకు, ఆమె కుటుంబానికి ఏర్పడి ఉన్నది. బుధవారం శశికళ పుష్పపై భానుమతి అనే మహిళ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి.
ఆమె ఇంట్లో పనిచేసిన తన భర్త కరుప్పుస్వామి అనుమానాస్పద స్థితిలో మరణించారని, ఆయనతో పాటుగా మరో ఏడుగురి ఇలా మరణించిన వారి జాబితాల్లో ఉన్నారంటూ భానుమతి చేసిన ఆరోపణలతో పోలీసులు విచారణకు చర్యలు చేపట్టారు. అదే సమయంలో రూ. 20 లక్షలు తీసుకున్న శశికళ కుటుంబం తిరిగి అడిగితే, హతమారుస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులు పోలీసులకు చేరాయి. ఇలా ఫిర్యాదులు హోరెత్తుతుండడంతో ఆత్మరక్షణలో పడ్డ శశికళ పుష్ప, ఇక తమిళనాట న్యాయం జరగదని భావించినట్టున్నారు. ఇప్పటికే మద్రాసు హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో, రాజ్య సభ సభ్యురాలి పదవితో దేశ రాజధానిలో తిష్ట వేసి ఉన్న ఆమె, అక్కడి చిరునామా ఆధారంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. బుధవారం ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేయడం, ఇందుకు తమిళనాడు ప్రభుత్వం తరపున న్యాయవాది సుబ్రమణ్య ప్రసాద్ ఆక్షేపణ వ్యక్తం చేయడం చోటు చేసుకున్నాయి.
ఈ ముందస్తు బెయిల్ విషయంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్పందిస్తూ, ఇంతకీ శశికళ, ఆమె భర్త లింగేశ్వర తిలగంల మీదున్న కేసులు ఏమిటో, వాటి వివరాలను తమ ముందు ఉంచాలని తమిళ పోలీసుల్ని ఆదేశించడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో మున్ముందు శశికళ పుష్ప మీద మరెన్ని ఆరోపణలతో కూడిన ఫిర్యాదులు హోరెత్తనున్నాయో వేచి చూడాల్సిందే.