
అమ్మయ్యా! నా పుట్టుక వివాదం ముగిసింది!
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై అమెరికా అధ్యక్షుడు బరాక్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
వాషింగ్టన్: రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై అమెరికా అధ్యక్షుడు బరాక్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'అమ్మాయ్యా! ఇప్పటికీ నా పుట్టుక వివాదం ముగిసిపోయింది' అంటూ ఆయన చమత్కరించారు. గతంలో ఒబామా జన్మస్థలం విషయమై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. తాజాగా ఆయన అమెరికాలోనే పుట్టినట్టు ఒప్పుకున్నారు. అమెరికా చట్టసభ (కాంగ్రెస్) లోని నల్లజాతి సభ్యుల సమావేశంలో ప్రసంగించిన ఒబామా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'మీ గురించి నాకు తెలియదు, కానీ నేను మాత్రం పుట్టుక వివాదం నుంచి బయటపడ్డాను' అంటూ ఆయన పేర్కొనడంతో ఆహూతులు నవ్వుల్లో పూశాయి.
ఒబామా బర్త్ సర్టిఫికెట్ ప్రామాణికతను ప్రశ్నిస్తూ.. ఆయన అమెరికాలోనే పుట్టారా? అంటూ ట్రంప్ వివాదం రేపారు. దేశం ఎన్నో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటుండగా.. మరికొద్దిరోజుల్లో అధ్యక్షుడిగా దిగిపోతున్న తన జన్మస్థలం గురించి ప్రశ్నించడం షాక్ కు గురిచేసిందని గతంలో ఒబామా పేర్కొన్నారు. తాజాగా ట్రంప్ ఒప్పుకొన్న నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. 'ఐఎస్ఐఎస్, ఉత్తర కొరియా, పేదరికం, వాతావరణ మార్పులు వంటి పెద్ద సమస్యలేవీ... నా బర్త్ సర్టిఫికెట్ అంశం అంతగా నా మెదడును తొలచలేదు. మరో 124 రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి దిగిపోనుండగా ఈ వివాదం పరిష్కారమైంది. అమ్మయ్యా!' అంటూ ఒబామా చమత్కరించగా.. సభికుల్లో నవ్వులు పూశాయి.
రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఒబామా 2017 జనవరి 20న పదవి నుంచి దిగిపోనున్నారు. ఆయన వారసుడిగా డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ లేదా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యం అధ్యక్ష పగ్గాలు చేపట్టే అవకాశముంది.