మతాచారాలు అపవిత్రం చేస్తున్నారు
చంద్రబాబుపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధ్వజం
శ్రీకాళహస్తి: పవిత్రమైన హిందూ ధర్మం, ఆచార, సాంప్రదయాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపవిత్రం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని మన్నవరం సభలో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సచివాలయ ప్రవేశం చేసిన బుధవారం ఉదయం 7.30 -9.00 గంటల మధ్య యమగండం ఉందని, ఆ సమయంలో ఉదయం 8.09 గంటలకు సచివాలయంలోకి ఎలా వెళతారని ప్రశ్నించారు. హిందూ మత, ఆచారాల ప్రకారం రాహుకాలం, యమగండం కచ్చితంగా పాటిస్తారని ఆయన గుర్తుచేశారు.
‘‘చంద్రబాబు గారూ.. అదే మీ ఇంటిలోని శుభ కార్యమైతే ఇలా యమగండంలోనే ప్రవేశిస్తారా? ’’ అని ప్రశ్నించారు. శుభకార్యంలో ఇంటి యజమాని ఎప్పుడైనా గుమ్మడి కాయ కొట్టిన ఆచారం ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. గుమ్మడి కాయ కొట్టాక, కాళ్లు కడుక్కోకుండానే లోనికి ప్రవేశించవచ్చా? అంటూ చెవిరెడ్డి ఎద్దేవా చేశారు. వస్త్రాలు ధరించి పుష్కరస్నానం ఆచరించడంతో పాటు అనేకమార్లు పాదరక్షలు తొలగించకుండా పూజలు చేసిన ఘన చరిత్ర కూడా చంద్రబాబుదేనన్నారు. దగ్గరివారు మరణిస్తే కర్మ తీరేవరకు ఆలయ ప్రవేశం చేయ రాదని తెలిసినా, బ్రహ్మోత్సవాల్లో తిరుమలేశునికి పట్టువస్త్రాలు ఇచ్చి ఆలయాన్ని అపవిత్రం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.
మీ మనుమడి కార్యక్రమం వాయిదా వేశారుగా?
రక్త సంబంధీకుల మరణం కారణంగా సీఎం చంద్రబాబుకు అంటు ఉందని.. కానీ అదే సమయంలో ఆయన రాజధాని నిర్మాణం కోసం పుట్టమన్ను, పవిత్ర జలాలు తీసుకెళ్లారని చెవిరెడ్డి గుర్తుచేశారు. అదే సందర్భంలో ఈ అంటు కారణంగా తన మనుమడికి సంబంధించిన ఓ శుభకార్యాన్ని మాత్రం సీఎం వాయిదా వేసుకున్నారని ఆయన వెల్లడించారు. విజయవాడలో చంద్రబాబు 40 ఆలయాలను కూలగొట్టించారని, ఇలాంటి సీఎం దేశంలో ఎక్కడైనా ఉన్నారా? అని ఎద్దేవా చేశారు. నిత్య పూజలందుకునే ఆంజనేయస్వామి విగ్రహాన్ని కూడా మున్సిపల్ కార్పొరేషన్ కుప్పతొట్టిలో పడేయించిన కార్యశీలి చంద్రబాబే అన్నారు. ఇవన్నీ హిందూ మతాన్ని అగౌరవ పరిచినట్టు కాదా? అన్నారు.బాబుకు హిందూ మతంపైన, ఆచార సంప్రదాయాలపైనా గౌరవంలేదని చెవిరెడ్డి పేర్కొన్నారు. నాడు సీఎంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతి గుడికి ధూప, దీప, నైవేద్యాలకు పభుత్వ నిధులు ఇచ్చి సంరక్షించారని గుర్తుచేశారు. ప్రస్తుతం అలాంటి గుడులు కూడా కనీస ధూప, దీప, నైవేద్యాలకు నోచుకోవటం లేదదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.