సీఎం ఇలాకాలో దళితులపై దాడి
- పండగవేళ రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
- నారావారిపల్లె సమీపంలో ఫ్లెక్సీల రగడ
- సీఎం మెప్పు పొందేందుకు ఎస్పీ అత్యుత్సాహం
- బాధితులపైనే కేసు నమోదు చేసిన పోలీసులు
తిరుపతి రూరల్: పండగవేళ సీఎం ఇలాకాలో టీడీపీ గూండాలు చెలరేగిపోయారు. నారావారిపల్లె సమీపంలోని పుదిపట్లలో అమాయక దళితులపై దాడికి తెగబడ్డారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి వర్గీయులు దళితులు ప్రయాణిస్తున్న కారును ధ్వంసంచేసి, ఐదుగురిపై హత్యాయత్నం చేశారు. సీఎం మెప్పు పొందేందుకు తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి మరింత అత్యుత్సాహం ప్రదర్శించారు. నిందితులను వదిలి.. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులపైనే కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. దీంతో ఆగ్రహించిన వారి బంధువులు స్థానిక ఎంఆర్ పల్లి పోలీసు స్టేషన్‌ముందు ధర్నా చేశారు. వారికి మద్దతుగా చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముత్యాలరెడ్డిపల్లి పోలీసు స్టేషన్‌లోనే ఉదయం నుంచి బైఠాయించారు. అమాయకులను వదలి వేయాలని వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, గంగాధర¯ðనెల్లూరు ఎమ్మెల్యే, నారాయణస్వామి డిమాండ్ చేశారు.
సీఎం చంద్రబాబు సంక్రాతికి స్వగ్రామం నారావారిపల్లె వస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆ ప్రాంతమంతా ఫ్లెక్సీలు కట్టారు. పుదిపట్లలో గురువారం సాయంత్రం టీడీపీ వర్గీయులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లోని ఓ వ్యక్తి బొమ్మను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. గతంలో టీడీపీలోని రెండువర్గాలు ఇలా ఫ్లెక్సీలను చించుకుని కేసులు సైతం నమోదు చేసుకున్నారు. అయితే సీఎం రాక నేపథ్యంలో తమ సత్తా చూపించాలని భావించిన గల్లా అరుణకుమారి వర్గీయులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసుకున్నారు. గురువారం రాత్రి సంక్రాంతి పండుగ నేపధ్యంలో షాపింగ్ చేసుకుని కుటుంబ సభ్యులతో కలసి వస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త మణిపై పుదిపట్ల సమీపంలో దాడికి తెగబడ్డారు. పెద్ద పెద్ద రాళ్లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. బాధితులు రక్తగాయాలతో చికిత్సకోసం తిరుపతి రుయాసుపత్రిలో చేరారు. అనంతరం గురు వారం అర్ధరాత్రి గల్లా అనుచరులపై ముత్యాలరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితులకు అండగా ఎమ్మెల్యే చెవిరెడ్డి
పోలీసుల తీరుపై చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. బాధితులకు అండగా ఎమ్మార్‌పల్లి పోలీసు స్టేషన్‌లో శుక్రవారం రోజంతా బైఠాయించారు. అమాయక దళితులను వదిలే వరకు స్టేషన్ నుంచి బయటకుపోనని భీష్మించుకున్నారు. వారికి అండగా నిలుస్తానని వెల్లడించారు.