చందమామపై నివాసాలు!
లండన్: చంద్రుడిపై అతి త్వరలోనే గ్రామాలు వెలియనున్నాయా..? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. వ్యోమగాములు, రోబోటిక్ వ్యవస్థల సాయంతో వీటిని నిర్మించి 2030 వరకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. భవిష్యత్‌లో చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాముల నివాసానికి ఈ గ్రామాలు ఉపయోగపడేందుకు నిర్మిస్తున్నారు. నెదర్లాండ్‌లో యురోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) నిర్వహిస్తున్న ‘న్యూ ఎరా ఆఫ్ కో ఆర్డినేటెడ్ హ్యూమన్, రోబోటిక్ ఎక్స్‌ప్లోరేషన్’ సదస్సులో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, పరిశ్రమల నిపుణుల బృందం ఈ మేరకు ప్రకటించింది.
అయితే గృహ నిర్మాణాలు నిజం కావాలంటే ముందుగా చంద్రుడిపై సరిపడా వనరులు ఉన్నాయా అనే అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధించాలని అమెరికాకు చెందిన క్లైవ్ నీల్ పేర్కొన్నారు. అంతే కాకుండా అవి ఎంత వరకు పనికొస్తాయో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ వనరులను కూడా నిర్మాణ యోగ్యంగా మలుచుకునే సాంకేతికతను రూపొందించాలని సూచించారు. అప్పుడే అందరం కలలు కంటున్న చంద్రుడిపై గ్రామాలు నిజమవుతుందని పేర్కొన్నారు.