ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతుంది
2017-18 నాటికి 8 శాతం
వృద్ధి రేటు సాధిస్తుంది
భారత్‌పై ప్రపంచ బ్యాంకు అంచనాలు
వాషింగ్టన్: వేగంగా అమలు చేస్తున్న సంస్కరణల ఊతంతో అంతర్జాతీయంగా నెలకొన్న ఒడిదుడుకుల పరిస్థితుల నుంచి భారత్ గట్టెక్కగలదని, ఎగుమతులు బలహీనంగా ఉన్నా 7.5 శాతం వృద్ధి రేటు సాధించగలదని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అత్యంత వేగంగా ఎదుగుతున్న పెద్ద దేశాల్లో ఒకటైన భారత్.. 2017-18 నాటికి 8 శాతం మేర వృద్ధి చెందగలదని పేర్కొంది. చైనా వృద్ధి క్రమంగా మందగిస్తున్న దరిమిలా.. భారీ వర్ధమాన మార్కెట్లలో భారత్ దీర్ఘకాలం పాటు అగ్రస్థానంలో కొనసాగే అవకాశాలు ఉన్నాయని దక్షిణాసియా ఆర్థిక పరిస్థితులపై నివేదికలో ప్రపంచ బ్యాంకు పేర్కొంది. పారిశ్రామికోత్పత్తి మెరుగుపడుతుండటం, పెట్టుబడుల పునరుద్ధరణ తదితర అంశాల కారణంగా భారత్‌లో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా మెరుగుపడగలవని వివరించింది. అయితే, దేశీయంగా కొన్ని కీలక సంస్కరణల అమల్లో జాప్యం, వాణిజ్యపరంగా బలహీన పనితీరు, గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో వేతనాల పెరుగుదల మందగించడం తదితర పరిణామాలతో వృద్ధికి కొంత రిస్కులు పొంచి ఉన్నాయని తెలిపింది.
ఏం చేయాలంటే..
పెండింగ్‌లో ఉన్న ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు మోక్షం లభించేలా.. ఆర్థికంగా ఊతం లభించే చర్యలు తీసుకోవడం అవసరమని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. అలాగే ప్రైవేట్ పెట్టుబడులకు అడ్డంకులను తొలగించాల్సి ఉంటుందని వివరించింది. మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై కేంద్రం ప్రధానంగా దృష్టి సారిస్తున్నందున.. ప్రభుత్వపరమైన పెట్టుబడులు పెరగగలవని, ప్రైవేట్ పెట్టుబడుల రాకకు ఇది తోడ్పడగలదని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఇక, ముడి చమురు ధరలు తగ్గిన ప్రయోజనాలు కూడా భారత్‌కు లభించగలవని పేర్కొంది. ఇలాంటి పరిణామాలతో .. 2017/18 నాటికి వృద్ధి రేటు 8 శాతానికి అందుకోగలదని వివరించింది. 2014-15లో 7.3 శాతంగా ఉన్న వృద్ధి రేటు 2015-16లో 7.5 శాతానికి పెరగగలదని తెలిపింది.
చైనా మందగమనంతో... ఆసియా దేశాలకు దెబ్బ: ఐఎంఎఫ్
వాషింగ్టన్: ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఎకానమీ అయిన చైనాలో మందగమనం ప్రభావం దాని పొరుగుదేశాలతో పాటు ఆసియాలోని ఇతర దేశాలపై కూడా ప్రతికూలంగా ఉండగలదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) హెచ్చరించింది. చైనా వృద్ధి ఒక్క శాతం మేర మందగిస్తే.. ఆ ప్రభావం కారణంగా ఇతర ఆసియా దేశాల వృద్ధి 0.3% మేర తగ్గుతుందని అంచనా వేసింది. ఈ ప్రతికూల ప్రభావాల పరిమాణం రాను రాను మరింతగా పెరగొచ్చని ఐఎంఎఫ్ తన బ్లాగ్‌లో పేర్కొంది. అంతర్జాతీయంగా ఒడిదుడుకుల పరిస్థితుల నుంచి భారత్ గట్టెక్కగలదని, చైనాలో మందగమనం కారణంగా వర్ధమాన మార్కెట్లలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా అగ్రస్థానంలో నిలవగలదని ప్రపంచ బ్యాంకు పేర్కొన్న నేపథ్యంలో ఐఎంఎఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనాలో మందగమన ప్రభావంతో కమోడిటీల ధరలు పడిపోవడం, అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం తత్ఫలితంగా ఆసియా దేశాలపై ఒత్తిళ్లు ఎక్కువవడం జరుగుతుందని ఐఎంఎఫ్ పేర్కొంది. కాబట్టి ఆయా దేశాలు ఏ పరిణామాన్నైనా ఎదుర్కొనేందుకు సదా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దాదాపు 35 ఏళ్ల పాటు అసాధారణ వేగంతో వృద్ధి చెందిన చైనా.. ప్రస్తుతం ఎగుమతి ఆధారిత దేశం స్థాయి నుంచి దేశీయంగా వినియోగాన్ని పెంచుకొనే దేశంగా రూపాంతరం చెందుతోందని ఐఎంఎఫ్ పేర్కొంది. ఇది సక్రమంగా జరిగితే ఈ ప్రాంతంలో మళ్లీ ఆర్థిక సామర్థ్యం మెరుగుపడగలదని తెలిపింది.
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అనంతరం చైనా వృద్ధి ప్రధానంగా పెట్టుబడులు, రుణాలపైనే ఆధారపడిందని ఐఎంఎఫ్ పేర్కొంది. రియల్టీ, బలహీన కార్పొరేట్ సంస్థలను.. ప్రభుత్వ రంగ సంస్థలను పరిపుష్టం చేయడంపైనే దృష్టి సారించడం జరిగిందని, అయితే ఈ చర్యల వల్ల రిస్కులు కూడా తలెత్తాయని తెలిపింది. కానీ ఈ రిస్కులు ఇప్పటికీ అదుపు చేసే స్థాయిలోనే ఉన్నాయని ఐఎంఎఫ్ పేర్కొంది.