ఆర్థిక వ్వవస్థ అతలాకుతలం...!
న్యూఢిల్లీ: కూరగాయలు... ముఖ్యంగా ఉల్లిపాయలు, టమాటాల ధరల సెగతో రిటైల్ ద్రవ్యోల్బణం ఒక్కసారిగా చుక్కలనంటింది. నవంబర్‌లో 11.24 శాతానికి దూసుకెళ్లింది. ఇది తొమ్మిది నెలల గరిష్టస్థాయి కావడం గమనార్హం. అక్టోబర్‌లో 10.17% (సవరణ తర్వాత)తో పోలిస్తే రిటైల్ ధరల పెరుగుదల రేటు 1.07% ఎగబాకడం ధరల మంటకు నిదర్శనం. వినియోగ ధరల సూచీ(సీపీఐ) ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు. రిటైల్ ధరల అనూహ్య పెరుగుదల నేపథ్యంలో ఈ నెల 18న చేపట్టనున్న పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించకపోవచ్చని, మళ్లీ పెంచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత రెండు సమీక్షల్లో కూడా ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పావు శాతం చొప్పున కీలక వడ్డీరేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ధరల కట్టడే ప్రధాన లక్ష్యమంటూ తాజాగా మరోసారి స్పష్టం చేశారు కూడా.
కూర‘గాయాలు’...
నవంబర్‌లో కూరగాయల ధరలు క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఏకంగా 61.6% ప్రియం అయ్యాయి. అక్టోబర్‌లో ఈ పెరుగుదల రేటు 45.67 శాతంగా ఉంది. కాగా, నవంబర్‌లో పండ్ల ధరలు 15%, పప్పుధాన్యాల ధరల 1.2%, తృణధాన్యాల ధరలు 12.07%, పాల ధరలు 9.06% చొప్పున పెరిగాయి. గుడ్లు, మాంసం, చేపలు కూడా 11.96% ప్రియంగా మారాయి. ఆహార, పానీయాల విభాగం ద్రవ్యోల్బణం 14.72 శాతానికి(అక్టోబర్‌లో 12.56%) ఎగసింది. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రిటైల్ ద్రవ్యోల్బణం 11.74%, పట్టణ పాంతాల్లో 10.5%గా నమోదైంది. కాగా, నవంబర్ నెలకు టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు సోమవారం(16న) వెలువడనున్నాయి. అక్టోబర్‌లో టోకు ధరల పెరుగుదల రేటు 7 శాతానికి(8 నెలల గరిష్టం) ఎగబాకిన సంగతి తెలిసిందే.