
తెలంగాణలో పార్టీని వదులుకోను
* సంక్షోభాలను ఎదుర్కొనే శక్తి ఒక్క టీడీపీకే ఉంది: చంద్రబాబు
* అంకితభావంతో పనిచేస్తే పూర్వ వైభవం వస్తుందని వ్యాఖ్య
* పార్టీలో తననెందుకు పక్కన పెట్టారో చెప్పాలని నిలదీసిన మోత్కుపల్లి
* గ్రేటర్ ఎన్నికల్లో ఓటమిపై చర్చించని టీ.టీడీపీ విస్తృతస్థాయి సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
టీడీపీ నుంచి ఒకరిద్దరు నాయకులు పోయినా పార్టీకి నష్టం లేదని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో తెలంగాణ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ వీడటం దురదృష్టకరమని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని... దేశంలో సంక్షోభాలను ఎదుర్కొనే శక్తి ఉన్న ఏకైక పార్టీ తమదేనని అన్నారు. ఎలాంటి సంక్షోభాన్నయినా ఒక అవకాశంగా మలుచుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీలో అందరూ అంకితభావంతో పనిచేస్తే పూర్వ వైభవం వస్తుందని చెప్పారు.
నాయకుడిగా గుర్తించడం లేదేం?
పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు పార్టీలో నెలకొన్న పరిణామాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘మైనస్ చంద్రబాబు వల్ల (చంద్రబాబు రాకపోతే) తెలంగాణలో ఏమీ జరగదు. ఉపన్యాసాలకు తావులేదు. నాయకత్వం అవసరం. సీఎంగా బాధ్యతల కోసం చంద్రబాబు ఏపీకి వెళ్లారు. తెలంగాణను వదిలేశారు. తెలంగాణకు చంద్రబాబు రావడం లేదన్న అభిప్రాయం జనంలోకి వెళ్లిపోయింది.
వారానికి ఒకరోజైనా ఇక్కడ సమయం కేటాయించాలి. తప్పకుండా అన్ని జిల్లాల్లో తిరగాలి. లేకుంటే పూర్వ వైభవం రాదు..’’ అని స్పష్టం చేశారు. తెలంగాణలో చంద్రబాబు మినహా మరే నాయకుడికి స్థానం లేకుండా పోయిందని, వేరేవారిని నాయకుడిగా గుర్తించడం లేదని వ్యాఖ్యానించారు. ‘‘పార్టీపై నన్ను మాట్లాడనీయకుండా నా ఎనర్జీని కాపాడారు ఇన్నాళ్లు. ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లో కూడా న న్ను ఎక్కడా ఉపయోగించుకోలేదు. నన్ను ఎందుకు పక్కన బెట్టారో అర్థం కావడం లేదు. ఈ మధ్యకాలంలో మీటింగుల్లో నన్ను ఎక్కడైనా చూశారా? గ్రేటర్ ఎన్నికల్లో నా ప్రమేయం అస్సలు లేదు..’’ అని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
లోకేశ్‌కు అధికార బాధ్యతలుండాలి: రేవంత్
నారా లోకేశ్‌ను కేంద్ర మంత్రిని చేయాలని పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పార్టీ అధినేత చంద్రబాబును కోరారు. ‘‘లోకేశ్‌కు పార్టీ బాధ్యతలే కాకుండా అధికార బాధ్యతలూ ఉంటే బాగుంటుంది. తద్వారా తెలంగాణలో అధికారులకు ఆదేశాలిచ్చే పరిస్థితి లోకేశ్‌కు ఉంటుంది. రాజకీయాల్లో హోదా కూడా ముఖ్యమే.’’ అని సూచించారు. తనకు అనుభవం తక్కువని, తప్పటడుగులు, తొట్రుపాట్లు ఉంటాయని సహకరించాలని కోరారు. వారంలో రెండు రోజులు బాబు తెలంగాణకు సమయం కేటాయించాలన్నారు.
ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, గాంధీ, గోపీనాథ్, సండ్ర వెంకట వీరయ్యతో పాటు పార్టీ నేతలు రావుల, అమర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు. కాగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటమి, అభ్యర్థుల ఎంపిక, సీట్ల అమ్మకాల ఫిర్యాదులు, డబ్బు పంపకాల్లో అవకతవకలపై కొందరు నాయకులు చంద్రబాబు, లోకేశ్‌కు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేశారు. అయితే విస్తృత స్థాయి సమావేశంలో ఈ ఓటమిపై చర్చ జరగకపోవడం గమనార్హం.