రూబిక్స్ క్యూబ్‌తో రోబో గిన్నిస్ రికార్డు
బెర్లిన్: ఇప్పటిదాకా మనుషులే గిన్నిస్ బుక్ రికార్డుల్ని సాధిస్తుంటే.. తాజాగా ఓ రోబో కూడా అందులో చోటు దక్కించుకుంది. కేవలం 0.637 సెకన్లలో 21 సార్లు క్యూబ్‌లను మార్చడం ద్వారా అన్ని రంగులను ఒకచోటుకు కలిపి పజిల్‌ను పూర్తిచేసింది. గతంలో ఓ రోబో 0.887 పూర్తిచేయడమే ఇప్పటిదాకా రికార్డు. కాగా ఇన్ఫినియాన్ టెక్నాలజీస్ సంస్థ రూపొందించిన ఓ రోబో ఈ రికార్డును అధిగమించింది. మునిచ్‌లోని ఎలక్ట్రానికా ట్రేడ్ ఫెయిర్‌లో నిర్వహించిన ఓ షోలో తాజా ఫీట్‌ను చేసి చూపింది.
క్షణాల్లో రూబిక్స్‌ను పరిశీలించడం, ఆ వెంటనే ఎలక్ట్రానిక్ చేతులు దాన్ని పట్టుకోవడం, చకాచకా 21 సార్లు వాటిని మార్చేయడం ఆ మరుక్షణమే రంగులన్నింటినీ ఒకచోటుకు తెచ్చేయడం చేసేసింది. అయితే ఎన్ని స్టెప్పుల్లో రంగులను కలిపిందనే విషయాన్ని కూడా గుర్తించడం సాధ్యం కాలేదని, దానిని కూడా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో లెక్కించామని నిర్వాహకులు తెలిపారు. దీన్నంతా ప్రత్యక్షంగా వీక్షించిన గిన్నిస్ బుక్ నిర్వాహకులు సదరు రోబోను తయారు చేసిన సంస్థకు రికార్డు ప్రతిని అందజేశారు.