Rubiks Cube
-
ఊపిరి బిగబట్టాడు.. గిన్నిస్ రికార్డు కెక్కాడు
చెన్నై : రూబిక్స్ క్యూబ్ పజిల్‌ను సాల్వ్ చేయటం అంత సులభమైన పని కాదు. ఏళ్ల తరబడి అభ్యాసం ఉంటే కానీ వాటిని పూర్తి చేయటం సాధ్యపడదు. అలాంటిది నీళ్లలో మునిగి రూబిక్స్ పజిల్‌ను పూర్తి చేయటం అంటే!.. అస్సలు చేతకాదని చేతులెత్తేస్తాం. కానీ, చెన్నైకి చెందిన ఇళయరామ్ శేఖర్ మాత్రం తన అత్యుత్తమమైన ప్రతిభతో గిన్నిస్ బుక్ రికార్డు సాధించాడు. 2.17 నిమిషాలు నీళ్లలో ఉండి మొత్తం 6 రూబిక్స్ పజిళ్లను పూర్తి చేశాడు. ఇందుకోసం ఏకంగా రెండేళ్ల పాటు కఠోర కృషి చేశాడు. అంతకు క్రితం ఐదు రూబిక్స్పై ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (మిలియనీర్లుగా యూట్యూబ్ స్టార్లు!) జీడబ్ల్యూఆర్ అనే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోను తమ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆగస్టు 22న ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటి వరకు దాదాపు లక్ష వ్యూస్ సంపాదించుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నేను మామూలుగానే రూబిక్స్ క్యూబ్ పజిల్‌ను సాల్వ్ చేయలేను. ఈయన ఏకంగా నీళ్లలో చేస్తున్నాడు.. అతడు రెండు నిమిషాలు నీళ్లలో ఉన్నాడు.. అద్భుతం ’’ అంటూ పొగిడేస్తున్నారు. -
కేటీఆర్ ఇన్ రూబిక్స్ క్యూబ్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా రూబిక్స్ క్యూబ్లతో ఆయన చిత్రపటాన్ని రూపొందించారు. బుధవారం కేటీఆర్ పుట్టిన రోజు కావడంతో కూకట్‌పల్లికి చెందిన టీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు పాటిమీది జగన్మోహన్రావు కార్యాలయంలో 2,100 రూబిక్స్ క్యూబ్లతో ఈ చిత్రపటాన్ని (పోర్ట్ట్రెయిట్) రూపొందించారు. ఇలా రూబిక్స్ క్యూబ్లతో చిత్రపటం రూపొందించడం మనదేశంలో తొలిసారని, కేటీఆర్‌కు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపాలన్న ఆలోచనతో తన మేనల్లుడు కౌశిక్, అతని మిత్రుడు శరణ్‌గుప్తా అనే 9వ తరగతి విద్యార్థులు రెండు రోజులు శ్రమించి ఈ చిత్రపటాన్ని రూపొందించినట్లు జగన్మోహన్ రావు తెలిపారు. నేడు కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ శాసనసభా పక్ష కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కేక్ కట్ చేయనున్నారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విద్యార్థివిభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. కేటీఆర్‌కు వరల్డ్ వాటర్ కాంగ్రెస్ ఆహ్వానం వచ్చే ఏడాది మేలో అమెరికాలోని నెవెడాలో జరగనున్న వరల్డ్ ఎన్విరాన్మెంటల్, వాటర్ కాంగ్రెస్ సదస్సుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి ఆహ్వానం అందింది. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ సంస్థ నిర్వహించే ఈ సదస్సుకు రెండోసారి కేటీఆర్‌కి ఆహ్వానం లభించింది. 2017లో కాలిఫోర్నియా శాక్రమెంటోలో జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీనోట్ అడ్రస్ ఇచ్చారు. 2017లో కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టుల గురించి కేటీఆర్ తన ప్రసంగంలో వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సాగు నీరు, పర్యావరణ సమతుల్యత, నీటి వనరుల అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలను గురించి తెలియజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభమైన విషయాన్ని తెలుసుకున్నట్టు కేటీఆర్‌కి పంపిన ఆహ్వానంలో నిర్వాహకులు పేర్కొన్నారు. ఈసారి కూడా కీనోట్ స్పీకర్‌గా హాజరై తెలంగాణ సాగునీటి అనుభవాలను వివరించాలని కోరారు. 2020 మే 17 నుంచి 21 వరకు అమెరికాలోని నెవెడాలో ఈ సదస్సు జరుగనుంది. వివిధ దేశాల్లోని సాగునీటి వ్యవస్థలు, స్మార్ట్ వాటర్ కార్యక్రమాల గురించి చర్చించనున్నట్టు పేర్కొన్నారు. -
రూబిక్స్ క్యూబ్‌తో రోబో గిన్నిస్ రికార్డు
బెర్లిన్: ఇప్పటిదాకా మనుషులే గిన్నిస్ బుక్ రికార్డుల్ని సాధిస్తుంటే.. తాజాగా ఓ రోబో కూడా అందులో చోటు దక్కించుకుంది. కేవలం 0.637 సెకన్లలో 21 సార్లు క్యూబ్‌లను మార్చడం ద్వారా అన్ని రంగులను ఒకచోటుకు కలిపి పజిల్‌ను పూర్తిచేసింది. గతంలో ఓ రోబో 0.887 పూర్తిచేయడమే ఇప్పటిదాకా రికార్డు. కాగా ఇన్ఫినియాన్ టెక్నాలజీస్ సంస్థ రూపొందించిన ఓ రోబో ఈ రికార్డును అధిగమించింది. మునిచ్‌లోని ఎలక్ట్రానికా ట్రేడ్ ఫెయిర్‌లో నిర్వహించిన ఓ షోలో తాజా ఫీట్‌ను చేసి చూపింది. క్షణాల్లో రూబిక్స్‌ను పరిశీలించడం, ఆ వెంటనే ఎలక్ట్రానిక్ చేతులు దాన్ని పట్టుకోవడం, చకాచకా 21 సార్లు వాటిని మార్చేయడం ఆ మరుక్షణమే రంగులన్నింటినీ ఒకచోటుకు తెచ్చేయడం చేసేసింది. అయితే ఎన్ని స్టెప్పుల్లో రంగులను కలిపిందనే విషయాన్ని కూడా గుర్తించడం సాధ్యం కాలేదని, దానిని కూడా ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో లెక్కించామని నిర్వాహకులు తెలిపారు. దీన్నంతా ప్రత్యక్షంగా వీక్షించిన గిన్నిస్ బుక్ నిర్వాహకులు సదరు రోబోను తయారు చేసిన సంస్థకు రికార్డు ప్రతిని అందజేశారు. -
ఈ క్రేజ్ ఏంటో?
బీజింగ్ : రూబిక్ క్యూబ్ గేమ్ తెలుసు కదా? లాజిక్, మ్యాజిక్ కలగలిసిన ఆట. భుజబలంతో కాదు.. బుద్ధి బలంతో ఆడాల్సిన ఆట. క్యూబ్ లో ఒకే రంగులో ఉన్న తొమ్మిది భాగాలనూ ఒకేవైపు ఉండేలా సెట్ చేయాలి. అలా ఆరు వైపులా సరి చేయాలి. మీరైతే దానిని ఎంతసేపట్లో సరిచేయగలరు? చెప్పలేం అంటారా? అయితే చైనా ఈ గేమ్ పై ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. రూబిక్ క్యూబ్ ఆడటం వల్ల తమ పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయని బాగా నమ్మతారు. ఒక్క బీజింగ్ లోనే 200కి పైగా క్యూబ్ శిక్షణ స్కూళ్లున్నాయి. ఇటీవల కాలంలో చైనాలో క్యూబింగ్ గేమ్ ఆడేవాళ్ల సంఖ్య బాగా పెరిగిందని వరల్డ్ క్యూబ్ అసోసియేషన్ (డబ్ల్యూసీఏ) ప్రతినిధి క్రిస్ క్రుగెర్ తెలిపారు. 2004లో ప్రపంచ క్యూబ్ అసోసియేషన్ ఏర్పడి, అప్పటి నుంచీ ప్రతినెలా పోటీలు నిర్వహిస్తోంది. డబ్ల్యూసీఏ నిర్వహించిన తొలి పోటీలో కేవలం 100 మంది మాత్రమే పాల్గొనగా, ఆ సంఖ్య ఇప్పుడు బాగా పెరిగిందని వెల్లడించారు. అమెరికాలో కూడా ఈ క్రీడకు విశేష ఆదరణ ఉందని, కానీ శిక్షణ అవకాశాలు మాత్రం చాలా తక్కువని పేర్కొన్నారు. దీంతో అమెరికాలోని ప్రజలు యూట్యూబ్ వీడియోల ద్వారా క్యూబింగ్ గేమ్ లోని మెలకువలు తెలుసుకుని సాధన చేస్తున్నారని వివరించారు. క్యూబ్ గేమ్ వల్ల ఆత్మవిశ్వాసం, ఏకాగ్రతతో పాటు చేతికి, కంటికి మధ్య సమన్వయం మరింతగా పెరుగుతుందని, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. ఇటీవల బీజింగ్ లో కూడా డబ్ల్యూసీఏ పోటీలను నిర్వహించింది. దాదాపు వెయ్యి మంది క్యూబ్ మేధావులు తమ తమ ప్రతిభాపాటవాలతో అందర్నీ కట్టిపడేశారు. ఈ పోటీలో చైనాకు చెందిన వాంగ్ ఖియాంగ్ అనే ఆరేళ్ల బుడతడు కేవలం 30 సెకన్లలోపే రూబిక్ క్యూబ్ సెట్ చేశాడు. కిండర్ గార్డెన్ నుంచే క్యూబ్ గేమ్ ఆడటం మొదలుపెట్టిన వాంగ్.. తొలిసారిగా ఈ పోటీలో పాల్గొని అందరి దృష్టీ ఆకర్షించాడు. వాంగ్ ఒక్కడే కాదు.. ఒకసారి ఒక క్యూబ్ సెట్ చేయడమే కష్టమనుకుంటే ఒకేసారి రెండు చేతులతో రెండు క్యూబ్ లు సరిచేసేసి శభాష్ అనిపించుకున్నారు కొందరు. ఇంకొందరైతే చేతులతో కాదు.. కాళ్లతో చేస్తాం అని చేసి చూపించారు కూడా. ఇవన్నీ ఒక ఎత్తైతే, కళ్లు తెరిచి చేస్తే గొప్పదనం ఏముంది? మేం కళ్లు మూసుకుని కూడా చేస్తాం అని చెప్పడమే కాకుండా.. క్యూబ్ సెట్ చేసి ఔరా అనిపించారు మరికొందరు. ఇలా మొత్తం 18 రకాలుగా తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. -
గంటలో 293 పజిల్స్!
సాక్షి, హైదరాబాద్: మనలో చాలా మంది క్యూబ్ ఫజిల్ని పూర్తి చేయడమే గొప్పగా భావిస్తాం. దాన్ని పూర్తిచేయడానికి కిందా మీదా పడుతుంటాం. అయినా దాన్ని పూర్తిచేస్తామనే గ్యారెంటీ లేదు. అయితే చెన్నైకి చెందిన కేశవ కిరుప అనే పదిహేనేళ్ల బాలుడు మాత్రం అవలీలగా కేవలం గంటలో 293 క్యూబ్ పజిల్స్‌ను పూర్తి చేశాడు. గతంలో ఫ్రాన్స్ కు చెందిన ఓ వ్యక్తి గంటలో 210 పూర్తి చేసి రికార్డు సృష్టించగా ఇప్పుడు దాన్ని మన కుర్రాడు తిరగరాసి... గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ ఘనత సాధించడం పట్ల కేశవ ఆనందం వ్యక్తం చేశాడు. దేశం తరఫున ఇలాంటి అరుదైన రికార్డు చేసినందుకు గర్వంగా ఉందన్నాడు. పజిల్స్‌ను పరిష్కరించడానికి సాధన చేస్తున్నప్పుడు మొదట 289 మాత్రమే పూర్తిచేయగలిగానని, క్రమంగా బాగా ప్రాక్టిస్ చేసి గంటలో 293 పూర్తి చేయగలిగానని కేశవ వివరించాడు.