ఈ క్రేజ్ ఏంటో?
ఈ క్రేజ్ ఏంటో?
Published Sat, Oct 8 2016 7:33 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
బీజింగ్ : రూబిక్ క్యూబ్ గేమ్ తెలుసు కదా? లాజిక్, మ్యాజిక్ కలగలిసిన ఆట. భుజబలంతో కాదు.. బుద్ధి బలంతో ఆడాల్సిన ఆట. క్యూబ్ లో ఒకే రంగులో ఉన్న తొమ్మిది భాగాలనూ ఒకేవైపు ఉండేలా సెట్ చేయాలి. అలా ఆరు వైపులా సరి చేయాలి. మీరైతే దానిని ఎంతసేపట్లో సరిచేయగలరు? చెప్పలేం అంటారా? అయితే చైనా ఈ గేమ్ పై ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. రూబిక్ క్యూబ్ ఆడటం వల్ల తమ పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయని బాగా నమ్మతారు. ఒక్క బీజింగ్ లోనే 200కి పైగా క్యూబ్ శిక్షణ స్కూళ్లున్నాయి. ఇటీవల కాలంలో చైనాలో క్యూబింగ్ గేమ్ ఆడేవాళ్ల సంఖ్య బాగా పెరిగిందని వరల్డ్ క్యూబ్ అసోసియేషన్ (డబ్ల్యూసీఏ) ప్రతినిధి క్రిస్ క్రుగెర్ తెలిపారు.
2004లో ప్రపంచ క్యూబ్ అసోసియేషన్ ఏర్పడి, అప్పటి నుంచీ ప్రతినెలా పోటీలు నిర్వహిస్తోంది. డబ్ల్యూసీఏ నిర్వహించిన తొలి పోటీలో కేవలం 100 మంది మాత్రమే పాల్గొనగా, ఆ సంఖ్య ఇప్పుడు బాగా పెరిగిందని వెల్లడించారు. అమెరికాలో కూడా ఈ క్రీడకు విశేష ఆదరణ ఉందని, కానీ శిక్షణ అవకాశాలు మాత్రం చాలా తక్కువని పేర్కొన్నారు. దీంతో అమెరికాలోని ప్రజలు యూట్యూబ్ వీడియోల ద్వారా క్యూబింగ్ గేమ్ లోని మెలకువలు తెలుసుకుని సాధన చేస్తున్నారని వివరించారు. క్యూబ్ గేమ్ వల్ల ఆత్మవిశ్వాసం, ఏకాగ్రతతో పాటు చేతికి, కంటికి మధ్య సమన్వయం మరింతగా పెరుగుతుందని, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని ఆయన తెలిపారు.
ఇటీవల బీజింగ్ లో కూడా డబ్ల్యూసీఏ పోటీలను నిర్వహించింది. దాదాపు వెయ్యి మంది క్యూబ్ మేధావులు తమ తమ ప్రతిభాపాటవాలతో అందర్నీ కట్టిపడేశారు. ఈ పోటీలో చైనాకు చెందిన వాంగ్ ఖియాంగ్ అనే ఆరేళ్ల బుడతడు కేవలం 30 సెకన్లలోపే రూబిక్ క్యూబ్ సెట్ చేశాడు. కిండర్ గార్డెన్ నుంచే క్యూబ్ గేమ్ ఆడటం మొదలుపెట్టిన వాంగ్.. తొలిసారిగా ఈ పోటీలో పాల్గొని అందరి దృష్టీ ఆకర్షించాడు. వాంగ్ ఒక్కడే కాదు.. ఒకసారి ఒక క్యూబ్ సెట్ చేయడమే కష్టమనుకుంటే ఒకేసారి రెండు చేతులతో రెండు క్యూబ్ లు సరిచేసేసి శభాష్ అనిపించుకున్నారు కొందరు. ఇంకొందరైతే చేతులతో కాదు.. కాళ్లతో చేస్తాం అని చేసి చూపించారు కూడా. ఇవన్నీ ఒక ఎత్తైతే, కళ్లు తెరిచి చేస్తే గొప్పదనం ఏముంది? మేం కళ్లు మూసుకుని కూడా చేస్తాం అని చెప్పడమే కాకుండా.. క్యూబ్ సెట్ చేసి ఔరా అనిపించారు మరికొందరు. ఇలా మొత్తం 18 రకాలుగా తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు.
Advertisement
Advertisement