59-60 స్థాయిలో రూపాయి ఉండాలి
ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 59-60గా ఉంటే సరైన స్థాయి అవుతుందని ఆర్థిక మంత్రి పి. చిదంబరం చెప్పారు. ఈ స్థాయిలోనూ అనేక దేశాలకు ఎగుమతులు చేసేందుకు పుష్కలంగా అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. భారతీయ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) సారథ్యంలో ఎగుమతిసంస్థలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాలు వివరించారు. ఆగస్టు 28న రూపాయి మారకం ఆల్‌టైం కనిష్టమైన 68.85కి పడిపోయిన నేపథ్యంలో చిదంబరం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు ఎగుమతులను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని చిదంబరం చెప్పారు.
ఎగుమతి సంస్థలకు రుణాలను ప్రాధాన్యతా రంగ రుణాలుగా పరిగణించాలన్న ఎగుమతిదారుల డిమాండ్‌ను పరిశీలిస్తున్నామని చిదంబరం చెప్పారు. ఈ అంశానికి ముడిపడి పలు సమస్యలు ఉన్నాయని, ముందుగా వీటిని పరిష్కరించాల్సి ఉంటుందని చిదంబరం పేర్కొన్నారు. ఎగుమతి రుణాలకు ప్రాధాన్యత హోదానిస్తే.. ప్రాధాన్యతా రంగంలోని మిగతా విభాగాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చన్న భయాలు ఉన్నాయని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఆర్‌బీఐతో చర్చిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం వ్యవసాయం, సూక్ష్మ..మధ్య తరహా సంస్థలు వంటి రంగాలకు ప్రాధాన్యతా రంగాల కింద చౌక వడ్డీ రేటుకు రుణాలు లభిస్తున్నాయి. వాణిజ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఆర్ రావు, రెవెన్యూ విభాగం కార్యదర్శి సుమీత్ బోస్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
చైనాతో పోల్చుకోవద్దు: చైనాలో తక్కువ వడ్డీకే రుణాలు లభిస్తున్నాయన్న ఎగుమతి సంస్థల వాదనలను తోసిపుచ్చుతూ చిదంబరం ఆ దేశంతో పోల్చుకోరాదన్నారు. వడ్డీ రేట్లనేవి వివిధ దేశాల పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయన్నారు. ఎగుమతిదారులు, తయారీ సంస్థలు బహుళ పన్నులు కట్టాల్సి వస్తుండటంపై స్పందిస్తూ..వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) విధానం అమల్లోకి వచ్చాకా వీటిలో చాలా మటుకు తొలగిపోతాయన్నారు.