
విదేశాంగ కార్యదర్శిగా జయశంకర్
అమెరికాలో భారత రాయబారిగా పనిచేస్తున్న ఎస్.జైశంకర్‌ను భారత విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: అమెరికాలో భారత రాయబారిగా పనిచేస్తున్న ఎస్.జైశంకర్‌ను భారత విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విదేశాంగ కార్యదర్శిగా ఉన్న సుజాతాసింగ్ పదవీ కాలం ఇంకా 8 నెలలు మిగిలివుండగానే ఆమెను ఆ పదవి నుంచి తప్పించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన నియామకాలపై మంత్రివర్గ కమిటీ ఈ ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంది.
1976 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్‌కు చెందిన సుజాతాసింగ్ రెండేళ్ల పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టులో ముగియాల్సి ఉంది. అయితే.. ఆమె పదవీ కాలాన్ని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని బుధవారం పొద్దుపోయాక ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆమె స్థానంలో విదేశాంగ కార్యదర్శిగా 1977 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్‌కు చెందిన జైశంకర్‌ను రెండేళ్ల కాలం లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ నియమిస్తున్నట్లు తెలిపింది.