
హసీనాతో ఆవేదన పంచుకున్న అద్వానీ
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని సింధ్ రాష్ట్రం స్వతంత్ర భారత్‌లో భాగంగా లేకపోవడం దురదృష్టకరమని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ పేర్కొన్నారు. ఢిల్లీలో సోమవారం ఇండియా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కలసి ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘నేను జన్మించిన సింధ్ భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక అందులో భాగం కాలేకపోయింది. ఆ ప్రాంతంలో నివసించిన నేను, నా సహచరులు దీనికి బాధపడుతున్నాం’ అని అన్నారు.
హసీనా భారత్‌కు రావడంతో తన ఆవేదనను ఆమెతో పంచుకుంటున్నానన్నారు. సింధ్ లేని భారత్ అసమగ్రమని అద్వానీ గతంలోనూ వ్యాఖ్యానించారు. 'కరాచీ, సింధు ప్రాంతాలు భారత్ లో భాగంగా ఉండవన్న విషయం నన్ను బాధకు గురిచేస్తోంది. సింధు ప్రాంతంలో చిన్నప్పుడు ఆరెస్సెస్ లో చురుగ్గా ఉండేవాడిని. సింధ్ రాష్ట్రం లేకుండా భారత్ అసమగ్రంగా ఉంటుందని భావిస్తున్నాన'ని 89 ఏళ్ల అద్వానీ గతంలో అన్నారు.