సమైక్యమే లక్ష్యంగా.. సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమం
సమైక్య ఉద్యమం రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. రాజకీయాలు, కులాలు, వర్గాలకతీతంగా ప్రజలే స్వచ్ఛందంగా సమైక్యరాష్ట్రం కావాలంటూ విభిన్నరీతిల్లో నిరసన వ్యక్తంచేస్తున్నారు. ప్రజోద్యమానికి సకలజనుల సమ్మె తోడు కావడంతో సీమాంధ్ర జిల్లాల్లో పాలన స్తంభించింది. ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి కదలక ఇరవైరోజులు దాటింది. అయినా సరే జనం లెక్కచేయక ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయొద్దంటూ అలుపెరగకుండా పోరాడుతున్నారు.
-సాక్షి నెట్‌వర్క్
సమైక్య ఉద్యమం 28వరోజు మంగళవారం కూడా ఉద్ధృతంగా సాగింది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారా లు, జాతీయరహదారుల దిగ్బంధనాలు, వినూత్న ఆందోళనలతో సీమాంధ్రజిల్లాలు హోరెత్తాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉద్యోగులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. పాలకొల్లులో గజల్స్ గాయకుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కవులు, రచయితలు, కళాకారుల సదస్సు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో దర్జీలు రహదారిపై మిషన్‌లు పెట్టి దుస్తులు కుట్టి నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలో జాతీయరహదారిపై రాస్తారోకోకు దిగిన వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు రోడ్డుపైనే నాట్లు వేసి నిరసన వ్యక్తంచేశారు.
మంగళగిరిలో 13వేల మంది విద్యార్థులతో ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు భారీప్రదర్శన నిర్వహించాయి. మాచర్లలో ఆర్టీసీ కార్మికులు చీరలు కట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో 30గోవులకు పూజలు నిర్వహించారు. రాజమండ్రిలో బుధ, గురువారాలు సకల జనుల సమ్మె చేయాలని అన్ని జేఏసీల నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని 50వేల పోస్టుకార్డులు రాసి ప్రధాని, రాష్ట్రపతికి పంపే కార్యక్రమాన్ని కడియంలో విద్యార్థులు ప్రారంభించారు. విశాఖలో మహిళలు బోనాలతో ర్యాలీ చేపట్టారు. నెల్లూరులో వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్యశాఖల సిబ్బంది ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
సూళ్లూరుపేటలో చేతివృత్తుల వారి ఆధ్వర్యంలో రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేసి వినూత్న నిరసన తెలిపారు. కృష్ణాజిల్లా కైకలూరులో చేపల రైతుల సం ఘం ఆధ్వర్యంలో జోరువానలో ర్యాలీ నిర్వహించారు. విజయనగరం కలెక్టరేట్ పరిసరాలను ఎన్జీఓలు చీపుళ్లతో ఊడ్చి శుభ్రం చేసి వినూత్న నిరసన చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి బొత్స సత్యనారాయణ క్యాం పు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. శ్రీకాకుళంలో జిల్లా కోర్టు బయట న్యాయవాదులు మాక్ కోర్టు నిర్వహించారు. కడపలో చెన్నై- బెంగళూరు జాతీయరహదారిపై జిల్లావ్యాప్తంగా పదిచోట్ల ఆందోళనకారులు దిగ్బంధనం చేపట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురం జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి చేపట్టిన 48 గంటల బంద్ విజయవంతమైంది.
నేడు, రేపు తిరుపతి దిగ్బంధం
తిరుపతి: బుధ, గురువారాల్లో తిరుపతిని సమైక్యవాదులు దిగ్బంధం చేయనున్నారు. ద్విచక్ర వాహనాలు తప్ప మరే ఇతర వాహనాలు తిరగకుండా బంద్ పాటించాలని నిర్ణయించారు. ఆ మేరకు తిరుమలకు వచ్చే భక్తులను రావద్దని పిలుపునిచ్చారు.
హోరెత్తిన లక్షగళార్చన
కర్నూలు: నంద్యాలలో లక్షగళార్చనకు విశేష స్పందన లభించింది. విద్యార్థుల ఉద్యమ గీతాలు, పాటలు, నృత్యాలతో వేదిక ప్రాంతం హోరెత్తింది. కర్నూలులోని బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంటకరెడ్డి తదితరులు బైఠాయించి వంటావార్పు చేపట్టారు. రాకపోకలను స్తంభింపజేశారు.
30న సీమాంధ్రలో వీధి దీపాలు వెలగవ్
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి రాష్ట్ర విభజన ప్రకటన వెలువడి ఈ నెల 30వ తేదీకి నెల రోజులు కావస్తోందని, దీనికి నిరసనగా ఆ రోజు సాయంత్రం సీమాంధ్రలోని అన్ని మునిసిపల్, కార్పొరేషన్లలో వీధి దీపాలను ఆర్పివేస్తున్నట్టు మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎల్.వర్మ మంగళవారం తిరుపతిలో వెల్లడించారు. సాయంత్రం 6గంటలకు వెలిగించే దీపాలను రాత్రి 9 గంటలకు వెలిగించి, మూడు గంటల పాటు నిరసన చేయనున్నట్లు తెలిపారు. ఇక బుధవారం నుంచి సీమాంధ్రలోని అన్ని మునిసిపల్, కార్పొరేషన్ల ఉద్యోగులు సామూహిక సాధారణ సెలవులను పెట్టి నిరసన వ్యక్తం చేయనున్నట్టు ప్రకటించారు.
దీక్షకు అనుమతిచ్చి.. అరెస్టులా?
హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు సంఘీభావంగా మంగళవారం నగరంలోని యూసఫ్‌గూడ చౌరస్తాలో దీక్ష చేపట్టేందుకు ప్రయత్నించిన ఆ పార్టీ నేతలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీక్షకు ముందుగా అనుమతిచ్చిన పోలీసు లు.. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆరెస్టులకు పాల్పడ్డారు. ఉదయం నుంచి చౌరస్తాలో హైడ్రామా చోటు చేసుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు దీక్ష టెంటును తొలగించి, వేదికను చిందరవందర చేశారు. ఫ్లెక్సీలను కూ లదోశారు. దీన్ని నిరసిస్తూ పార్టీ ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ నేత డాక్టర్ ప్రఫుల్లారెడ్డి ఆధ్వర్యంలో వందలాది కార్యకర్తలు రోడ్డు పక్కన బైఠాయించి నిరసన తెలిపారు.
జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేసి, బంజారాహిల్స్ ఠాణాకు తరలించారు. పోలీసుల దమనకాండను ఎండగడుతూ మధుసూదన్‌రెడ్డితో పాటు ఎన్.భిక్షపతి, ఎం.కాశీరెడ్డి, ఎం.శ్రీనివాస్, శివశంకర్, ఆది త్య, గుర్రంపాటి దేవేంద్ర, పోతుల శివ, అశోక్, వై.ఇందిరారెడ్డి, జేఎల్ మేరీ, కట్టా రాఘసంధ్య, నూకల విజయలక్ష్మి తదితర నేతలు స్టేషన్‌లోనే ధర్నా చేశారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని మధుసూదన్‌రెడ్డి తెలిపారు. తాము శాంతియుతంగా సంఘీభావం తెలపడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారని విమర్శించారు.