నోట్7 ఆలస్యం ఎవరికి కలిసొస్తుంది?
నోట్7 ఆలస్యం ఎవరికి కలిసొస్తుంది?
Published Thu, Sep 29 2016 11:51 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
న్యూఢిల్లీ : పండుగల సీజన్ వచ్చిదంటే చాలు...కంపెనీలకు పండుగే పండుగ. కొత్త కొత్త ప్రొడక్ట్ల ఆవిష్కరణలతో వినియోగదారుల ముందుకు వస్తుంటాయి. కానీ స్మార్ట్ఫోన్ల రారాజు శాంసంగ్కు ఈ పండుగ సీజన్ కొంత నిరాశేమిగిల్చేలా కనిపిస్తోంది. ఓ వైపు ఆపిల్ తన కొత్త మోడల్స్ ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్లను దీపావళికి ముందే భారత మార్కెట్లో ప్రవేశపెడుతుండగా.. శాంసంగ్ మాత్రం తన తాజా ఫ్లాగ్షిప్ గెలాక్సీ నోట్7ను విడుదలను జాప్యం చేస్తూ ఉంది. శాంసంగ్కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఆపిల్ ఆ జాప్యాన్ని అదునుగా చేసుకుని ఈ పండుగల సీజన్లో బాగా లాభపడే అవకాశం ఉందని సీనియర్ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్స్ చెబుతున్నారు.
భారత్లో గెలాక్సీ నోట్7 విడుదల ఆలస్యానికి ప్రధాన కారణం బ్యాటరీ పేలుళ్ల సమస్య. ఇటీవల నెలకొన్న ఈ సమస్య శాంసంగ్కు పెద్ద తలనొప్పిలా మారింది. బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో గెలాక్సీ నోట్7 అమ్మకాలను నిలిపివేసి, అంతర్జాతీయంగా 2.5 మిలియన్ డివైజ్లను రీకాల్ చేసింది. ప్రస్తుతం ఆ బ్యాటరీ పేలుళ్ల సమస్యకు పరిష్కారం కనుగొని, సురక్షితమైన బ్యాటరీతో గెలాక్సీ నోట్7లను మళ్లీ అంతర్జాతీయ మార్కెట్లో పునఃప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. శాంసంగ్కు కీలక మార్కెట్లు దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూఎస్లలో రీలాంచ్ చేస్తామని ప్రకటించిన కంపెనీ ప్రకటించింది. కానీ ప్రభావితమైన ఫోన్ రీకాల్ ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో రీలాంచ్ను తేదీలను శాంసంగ్ వాయిదా చేసింది.
ఆ మార్కెట్లలో రీలాంచ్తో పాటు భారత్లో కూడా నోట్7ను సెప్టెంబర్ చివరవారంలో ఆవిష్కరించాలని శాంసంగ్ ఇండియా ప్లాన్ చేసింది. కానీ ఆ తేదీని ఆలస్యం చేసి ఐఫోన్7తో పాటు నోట్7 మార్కెట్లోకి వచ్చేలా వ్యూహాలు రచిస్తోంది. దీపావళి కానుకగా ఈ ఫోన్ ను భారత్ లో ప్రవేశపెట్టనున్నట్టు ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెబుతుండగా.. మళ్లీ గెలాక్సీ నోట్ 7 విడుదల ఆలస్యమయ్యే అవకాశాలున్నట్టు మరో ఎగ్జిక్యూటివ్ పేర్కొంటున్నారు. దీపావళి తర్వాతే దీన్ని ఆవిష్కరణ ఉండొచ్చంటున్నారు.
దీంతో ఐఫోన్ 7 కంటే తన ఫోన్ను ముందుగానే భారత మార్కెట్లోకి ప్రవేపెట్టాలనే ప్లాన్స్, ఫెస్టివల్ కోరిక రెండూ శాంసంగ్కు నెరవేరేలా కనిపించడం లేదు. ఎక్కువ రోజులు గెలాక్సీ నోట్7 విడుదలను ఆలస్యం చేస్తూ పోతే వినియోగదారుల నిరీక్షణకు పరిక్ష పెట్టినట్టై, వారు సహనం కోల్పోయే ప్రమాదముందని ఓ మార్కెట్ ఎగ్జిక్యూటివ్ హెచ్చరిస్తున్నారు. కాగ, గత పండుగల కాలం అక్టోబర్-డిసెంబర్లో ఆపిల్ 850,000 ఐఫోన్లను విక్రయించగా.. ఈ ఏడాది ఒక మిలియన్ యూనిట్లను అమ్మే అవకాశాలు కనిపిస్తున్నాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పేర్కొంటోంది. ఆలస్యమవుతున్న నోట్7 విడుదలే, ఈ ఆపిల్ ఫోన్ల విక్రయానికి బాగా కలిసివస్తుందని చెబుతోంది.అక్టోబర్-డిసెంబర్ కాలాన్ని ఎంతో కీలకంగా భావించే స్మార్ట్ఫోన్ కంపెనీలు కొత్త కొత్త ఫోన్ల ఆవిష్కరణలను చేపడతాయి. 40 శాతానికి పైగా ఏడాది అమ్మకాలు ఈ త్రైమాసికంలోనే జరుపుతాయి.
Advertisement
Advertisement