సంజయ్‌దత్‌కు పెరోల్‌పై హైకోర్టు ఆగ్రహం
ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు ఏడాదిలో మూడు సార్లు పెరోల్ మంజూరు చేసిన అంశంలో మహారాష్ట్ర సర్కారు బాంబే హైకోర్టు ఆగ్రహాన్ని చవిచూసింది. సంజయ్‌దత్ విషయంలో శ్రద్ధ చూపడం ద్వారా ఇతరఖైదీలకు, అతనికి మధ్య వివక్ష చూపినట్లు పేర్కొంది. పెరోల్, ఫర్లాగ్ దరఖాస్తుల పరిశీలనకు సంబంధించిన నిబంధనలను సమూలంగా మార్చివేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ దిశగా సవరణలు సూచించేందుకు వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కమిటీ వేయాలని మహారాష్ట్ర సర్కారు ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ డివిజన్ బెంచ్ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
సంజయ్‌దత్‌కు పెరోల్ గడువును మార్చి 21 వరకు పొడిగిస్తూ(మూడోసారి) మహారాష్ట్ర సర్కారు ఇటీవలే నిర్ణయం తీసుకుంది. తన భార్య మాన్యత క్షయతో బాధపడుతున్నందున గడువు పొడిగించాలని సంజయ్ కోరడంతో అనుమతించింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించింది. సాధారణ ఖైదీలు పెరోల్ కోసం దరఖాస్తు చేసుకుని నెలలు గడిచినా.. వాటిపై నిర్ణయం తీసుకోని జైలు అధికారులు సంజయ్‌దత్ విషయంలో వేగంగా చర్యలు తీసుకోవడాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. బాధ ఎవరికైనా సమానమేనని.. ఈ విషయంలో జైలు అధికారులు పక్షపాతం చూపారని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాదు, ఇతర ఖైదీల నుంచి పెరోల్ సందర్భంగా రూ. 10 వేలు నుంచి రూ. 20 వేల వరకు బాండ్ తీసుకుంటుంటే.. సంజయ్ నుంచి కేవలం రూ. 5 వేల బాండ్ తీసుకోవడాన్నీ కోర్టు ప్రశ్నించింది.