
పొలార్డ్‌ను నేను ఆ మాట అనలేదు!
ఆఖరి ఐదు, ఆరు ఓవర్లలో కొన్ని షాట్లు కొట్టడం తప్ప సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటం పొలార్డ్ వల్ల కాదు... గత మ్యాచ్‌లో విఫలమైన తర్వాత విండీస్ క్రికెటర్ గురించి ముంబైకర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్య ఇది. దానికి ట్విట్టర్‌లో ఘాటుగానే బదులిచ్చిన పొలార్డ్ ఇప్పుడు తన బ్యాట్‌తోనూ మైదానం నుంచి సమాధానమిచ్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే బ్యాటింగ్‌కు వచ్చి తనదైన శైలిలో చెలరేగిన అతను తన విలువేమిటో చూపించాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మ్యాచ్‌లో 47 బంతుల్లో మూడు ఫోర్లు, ఐదు సక్సర్లతో 70 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ విజయానికి బాటలు వేశాడు.
ఈ నేపథ్యంలో ఈ వివాదంపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రెకర్ స్పందించాడు. గత మ్యాచ్ కామెంటేటరీ సందర్భంగా తాను ఎప్పుడూ కీరన్ పొలార్డ్‌ను ఉద్దేశించి బుర్రలేని వ్యక్తి అని అనలేదని వివరణ ఇచ్చాడు. 'హయ్యర్ ఆర్డర్‌లో ఆడే రేంజ్ అతనికి ఉందా? అని మాత్రమే నేను అన్నాను. బుర్రలేదు, తెలివిలేదు లాంటి పదాలను ఉపయోగించడం నా స్టైల్ కాదు. నేను విమర్శలు చేస్తానేమో కానీ అవమానించను' మంజ్రెకర్ ట్వీట్ చేశాడు. కావాలంటే తన వీడియో దృశ్యాలను పరిశీలించుకోవచ్చునని ట్విట్టర్‌లో తనపై విమర్శలు చేస్తున్నవారిని ఉద్దేశించి పేర్కొన్నాడు. నిజానికి పొలార్డ్‌ను ఉద్దేశించి 'బుర్రలేదు' అనే పదాన్ని మంజ్రెకర్ వాడలేదు. కానీ, ఆ పదాన్ని వాడాడంటూ పొలార్డ్ మంజ్రెకర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే.