Published
Tue, Feb 14 2017 11:23 AM
| Last Updated on Sun, Sep 2 2018 5:28 PM
శశికళకు నాలుగేళ్ల శిక్ష కానీ..
జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎ2గా ఉన్న వీకే శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. అయితే ఆమె వాస్తవంగా అనుభవించాల్సింది మాత్రం మూడున్నరేళ్లు మాత్రమే. ఎందుకంటే, ఇంతకుముందు దిగువకోర్టులో తీర్పు వచ్చినప్పుడు జయలలిత, శశికళ సహా మొత్తం నలుగురు దోషులు ఆరు నెలల పాటు జైలుశిక్ష అనుభవించారు. అప్పట్లో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో వాళ్లు శిక్ష అనుభవించారు. దాంతో ఆ శిక్షా కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, ఇప్పుడు మిగిలిన మూడున్నరేళ్ల జైలుశిక్షను మాత్రమే శశికళ, సుధాకరన్, ఇళవరసి.. ఈ ముగ్గురూ అనుభవించాల్సి ఉంటుంది.
సాధారణంగా ఏ కేసులోనైనా దిగువ కోర్టులు తీర్పు ఇచ్చినప్పుడు శిక్ష అనుభవిస్తూ పైకోర్టులో అప్పీలుకు వెళ్తే, అక్కడ స్టే లేదా బెయిల్ వచ్చేవరకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అప్పుడు పైకోర్టులో నిందితులకు అనుకూలంగా తీర్పు వస్తే.. పూర్తిగా విడుదల కావడం, లేనిపక్షంలో అంతకుముందు అనుభవించిన శిక్షాకాలం మినహాయించి మిగిలిన కాలానికి శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు శశికళ విషయంలో కూడా అదే జరిగింది. ఇంతకుముందు ఆమె అనుభవించిన ఆరునెలల కాలాన్ని మినహాయించి మిగిలిన మూడున్నరేళ్ల శిక్ష ఇప్పుడు అనుభవించాలి.