Published
Tue, Feb 14 2017 12:27 PM
| Last Updated on Sun, Sep 2 2018 5:43 PM
మూడు నిమిషాల్లో మారిన తలరాత
అది మహాబలిపురం సమీపంలోని కూవత్తూర్ ప్రాంతంలో గల గోల్డెన్ బే రిసార్ట్ ప్రాంతం. మంగళవారం ఉదయం పదిన్నర గంటల సమయం. సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చిన్నమ్మ శశికళ కూడా అక్కడే ఉన్నారు. సోమవారం సాయంత్రమే ఆమె అక్కడకు చేరుకున్నారు. అటు ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టులో కూడా ఇరు వర్గాలకు చెందిన న్యాయవాదులు, ఇతరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఏ క్షణంలోనైనా తీర్పు రావచ్చని ఎదురు చూస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలోని ఆరో నెంబరు కోర్టులో జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అమితవరాయ్ ఇద్దరూ తమ తమ స్థానాల్లోకి చేరుకున్నారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ తన చేతుల్లో ఉన్న సీల్డ్ కవర్ విప్పారు. ఇది సంక్లిష్టమైన అంశమే అయినా తీర్పు ఇస్తున్నామని చెప్పారు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.
కర్ణాటక హైకోర్టు తీర్పును పక్కన పెట్టేశారు. శశికళ సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న సుధాకరన్, ఇళవరసి అంతా దోషులేనని, నాలుగు సంవత్సరాల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియకు పట్టింది రెండు మూడు నిమిషాలు మాత్రమే. ఈ కొద్ది సమయంలోనే శశికళ తలరాత మొత్తం తలకిందులైంది. తీర్పు తనకు అనుకూలంగా వస్తే గవర్నర్ ఏ క్షణంలోనైనా తనను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి పిలవచ్చని ఆశించిన ఆమె.. సోమవారం కూడా మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా ధీమాగా కనిపించారు. అమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేది తాను మాత్రమేనని, పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది కూడా తానేనని చెప్పారు. కానీ, తీర్పు వచ్చిన వెంటనే ఆమె ఆశలు అడియాసలయ్యాయి.