ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు తీపి కబురు అందించింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది. రూ.30లక్షలపైన ఉన్న లోన్లపై 10బేసిస్ పాయింట్లు, రూ.30లక్షలలోపు ఉన్న లోన్లపై 25బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు సోమవారం పక్రటించింది. మే 9వ తేదీనుంచి ఈ వడ్డీరేట్లు అమల్లోకి రానున్నాయని తెలిపింది.
దీని ప్రకారం రూ.30లక్షల లోపు రుణాలపై ప్రస్తుతం ఉన్న వడ్డీరేటు 8.6 శాతం నుంచి 8.35శాతంగా ఉండనుంది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) పథకం కింద రుణం తీసుకునే ఖాతాదారులు కనీసం రూ. 2.67లక్షల దాకా సబ్బిడీ పొందవచ్చునని తెలిపింది. ఈ పథకం కింద మధ్య ఆదాయ వర్గాల వారు మొదటి సారి గృహ రుణ రుణగ్రహీతలు ఈ తగ్గింపును పొందవచ్చని తెలిపింది. తమ రేట్లు తగ్గింపుతో గృహ కొనుగోలుదారులకు సరసమైన ధరలో గృహాలు సొంతం చేసుకోవాలనుకునే మిలియన్ల మంది కల నెరవేరుతుందని నేషనల్ బ్యాంకింగ్ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ రాజ్నీష్ కుమార్ చెప్పారు.
మరోవైపు ఈప్రభావం మార్కెట్‌లో షేర్ ధరపై చూపించింది. ఇంట్రాడేలో రూ.300మార్క్ మరోసారి టచ్ చేసిన ఎస్‌బిఐ అనంతరం రూ.294కి పతనమైంది. మళ్లీ కోలుకొని దాదాపు 2 శాతం లాభాలతో కొనసాగుతోంది.